ఏజీ కృష్ణమూర్తి కన్నుమూత
గుంటూరు: ముద్ర యాడ్స్ వ్యవస్థాపక చైర్మన్ ఏజీ కృష్ణమూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 1942లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన ఆయన 1968లో మొదట ఓ చిరుద్యోగిగా తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం 1972లో ధీరూబాయి అంబానీ కంపెనీలో యాడ్ మేనేజర్గా పనిచేశారు. 1980లో కేజీ కృష్ణమూర్తి ముద్ర కమ్యూనికేషన్ను ప్రారంభించారు. 35 వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్‌తోను అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ మొదలు పెట్టారు. ఏజీకే బ్రాండ్ పేరుతో కన్సల్టింగ్ను ఆయన ప్రారంభించారు.
కేవలం తొమ్మిదేళ్ళలో ముద్ర భారతదేశంలోని అతిపెద్ద అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ప్రభుత్వంలో చిన్న గుమస్తా ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి కలిసి పనిచేసి అతికొద్దికాలంలో తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. కృష్ణమూర్తి రూపొందించిన విమల్, రస్నా లాంటి యాడ్లు ప్రముఖంగా నిలిచాయి. 'అందని ఆకాశం' పుస్తకాన్ని అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు.