ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
తూర్పుగోదావరి: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు, పరిటాల రవి చనిపోయినప్పుడు విధ్వంసం సృష్టించాలని పిలుపునిచ్చింది చంద్రబాబే అన్నారు. పరిటాల రవిని హత్య చేస్తారని చంద్రబాబుకు తెలుసి కూడా రాజకీయ మైలేజ్ కోసం పాకులాడారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి చనిపోయిన రోజున అన్ని జిల్లాల్లో పార్టీ సమావేశాలు పెట్టి.. 'తగలబెట్టండి' అని చంద్రబాబు దహనకాండను ప్రేరేపించారన్నారు. రాజమండ్రి పుష్కర పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.
తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపుల్లోని కులాలను విడదీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. విభజించి పాలించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పటివరకు మంజునాథ్ కమిషన్ పర్యటించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు.
అమాయక ప్రజలను జైల్లో పెడుతున్నారని.. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ముద్రగడ స్పష్టం చేశారు. రేపు సాయంత్రంలోగా కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయకపోతే.. గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ముద్రగడ ప్రకటించారు.