ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
Published Wed, Jan 11 2017 10:49 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం
పిడుగురాళ్ల (గురజాల) : మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో చిక్కిన ఘటన పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానందం శాంతో మాట్లాడుతూ.. గత వేసవి కాలంలో పట్టణంలో పలు వార్డుల్లో తాగునీరు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ యరగాని ఏసుబాబుకు మూడు వర్క్ ఆర్డర్లు అందించారని చెప్పారు. వాటి ప్రకారం అతనికి రూ.4.20 లక్షల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. వాటికోసం ఎంబుక్స్ రికార్డు చేసేందుకు గత కొన్ని నెలలుగా మున్సిపల్ ఏఈ బాబర్ రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఏసుబాబు ఏసీబీని ఆశ్రయించటంతో మొదటి విడతగా రూ.10 వేలు ఏఈ బాబర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జరిపిన దాడిలో ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఈ రామమునిరెడ్డిని మున్సిపల్ కార్యాలయానికి రావాలని తాను ఫోన్ చేసినా రాలేదని, దీంతో తామే డీఈ గృహానికి వెళ్లామని వివరించారు. ఈ దాడిలో సీఐ వెంకటేశ్వర్లు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
కడుపు కాలి ఏసీబీని ఆశ్రయించా
- యరగాని ఏసుబాబు, కాంట్రాక్టర్
ఆరు నెలలుగా బిల్లులు చేయక ఇబ్బందులు పెట్టడమే కాక తనకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక ఏసీబీ అధికారులను సంప్రదించాను. ట్రాక్టర్లకు డీజిల్ బకాయి బిల్లులు ఇవ్వాలని నిత్యం ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఏఈ బాబర్ దృష్టికి తీసుకెళ్లినా కనికరించకుంగా నిర్లక్షంగా వ్యవహరించారు. అందుకే తప్పని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించా.
Advertisement