-
నగర, పురపాలక సంస్థలకు వరంగా మారిన కేంద్రం నిర్ణయం
-
రూ.500, రూ.1000 నోట్లతో పన్ను చెల్లించే
-
వెసులుబాటుతో అనూహ్యంగా పెరిగిన వసూళ్లు
-
నవంబర్‌లో భారీగా పెరిగిన ఆదాయం
అంత వరకూ దర్జాగా బతికిన వాళ్లు దివాళా తీసి దరిద్రులుగా మిగిలినట్టయింది .. గత నెల 8న రూ.500, రూ.1000 నోట్ల పరిస్థితి. జేబులోనో, ఇంట్లోని బీరువాలోనో ఉంటే ఎంతో భరోసానిచ్చిన ఆ కరెన్సీయే అకస్మాత్తుగా నెత్తి మీద ముళ్లకట్టెల మోపు మోస్తున్నంత భారంగా, దుర్భరంగా అనిపించింది. ఆ రోజు ఆ నోట్ల చలామణీని రద్దు చేసిన కేంద్రం..కలుగుల్లో పొగ బెట్టి ఎలుకల్ని బయటికి రప్పించినట్టు..‘నల్లధనాన్ని వెలికి తీయడానికే ఈ విప్లవాత్మక నిర్ణయం’ అని చెప్పినా.. ఆ నోట్లు దగ్గరున్న పేదలు సైతం వాటిని ఎలా మార్చుకోవాలా అని కలవరపడ్డారు. ప్రతి బ్యాంకూ, ప్రతి పోస్టాఫీసు వద్దా.. పుష్కరాల వేళ గోదావరి రేవుల్లోలా ఒకటే రద్దీ. అంతేకాక..నోట్ల మార్పిడికి పరిమితీ ఉండడంతో తమ వద్ద ఉన్న ఆ నోట్లు విరగడ అవుతాయో, లేదోనని దిగాలు పడ్డారు. అయితే కేంద్రం.. నిర్దిష్ట వ్యవధిలో వాటితో కొన్ని చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించింది. అలాంటి వాటిలో ఒకటి.. రద్దయిన పెద్దనోట్లతో పురపాలక సంఘాలకు, నగర పాలక సంస్థలకు పన్నుల బకాయిలు చెల్లించే అవకాశం. ఈ వెసులుబాటు ఆ స్థానిక పరిపాలనా సంస్థలకు ‘సిరి’ని తెచ్చి పెట్టింది. రద్దయిన నోట్లతో పన్నులకు సంబంధించిన మొండి బకాయిలతో సహా చెల్లించడానికి ప్రతి పట్టణంలో, నగరంలో ఎందరో ఆరాటపడడంతో నవంబర్‌లో స్థానిక సంస్థల రాబడి ఎన్నో రెట్లు పెరిగింది. ఈ పరిణామంపై ‘సాక్షి’ ఫోకస్..
కాకినాడకు కాసుల పంట
కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 11 నుంచి 30 వరకూ సుమారు రూ.3 కోట్ల పన్నులు రూపంలో వసూలు చేయగలిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, సెప్టెంబర్‌తో ముగిసిన అర్ధ సంవత్సరా>నికి దాదాపు 50 శాతం వసూలు చేయగలిగారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే 2వ అర్ధసంవత్సరం బకాయిలు సాధారణంగా జనవరి నుంచి మార్చి మధ్యలో వసూలయ్యేవి. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.5 కోట్ల వరకు వసూలయ్యాయి. నవంబర్ 8న నోట్ల రద్దు అనంతరం 11 నుంచి 24 వరకు పాత నోట్లను స్వీకరిస్తామని నగరపాలక సంస్థ ప్రకటించింది. మరో అడుగు ముందుకు వేసి వచ్చే ఐదేళ్ళకు అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించినా తీసుకుంటామనడంతో పన్ను చెల్లింపుదారుల్లో స్పందన బాగా కనిపించింది. నిర్ణీత సమయంలో ఇంటి పన్నుల ద్వారా రూ.2.50 కోట్లు, నీటి పన్నుల ద్వారా రూ.37 లక్షలు, ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.13 లక్షలు మొత్తం రూ.3కోట్ల పన్నులు రాబట్టగలిగారు. అడ్వా¯Œ్స ట్యాక్స్ చెల్లించొచ్చన్న దానికి మాత్రం స్పందన కానరాలేదు. మొత్తం మీద.. దండోరాలు వేసి, రెడ్‌నోటీసులు, జప్తు నోటీసులు ఇస్తే తప్ప వసూలు కాని పన్నులు, బకాయిలు నోట్ల రద్దు పుణ్యమాని నేపద్యంలో బాగానే వసూలయ్యాయని కార్పొరేష¯ŒS వర్గాలు చెబుతున్నాయి.
– కాకినాడ
ఒక్క నెలలోనే నాలుగో వంతు..
రద్దయిన పెద్ద నోట్ల భారం దించుకునేందుకు వాటితో అనేకులు పన్నులను చెల్లించడంతో అమలాపురం పురపాలక సంఘానికి ఒక్క నవంబర్ నెలలోనే రూ.61.60 లక్షల ఆదాయం వచ్చింది. మున్సిపాలిటీలో మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లు. నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచీ ఆ నెలలో మిగిలిన 22 రోజుల్లో మున్సిపాలిటీకి ఏకంగా రూ.61.50 లక్షల పన్ను రాబడి లభించింది. సాధారణంగా నవంబర్ నెల పన్నుల వసూళ్లకు అ¯ŒS సీజ¯ŒS. సెప్టెంబర్, అక్టోబర్, మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పన్ను వసూళ్లు ముమ్మరంగా ఉంటాయి. మున్సిపాలిటీలో గత అక్టోబర్ నెలలో ఆస్తి పన్నులు రూ.9.76 లక్షలు, తాగునీటి పన్నులు కేవలం రూ.77 వేలు మాత్రమే వసూలయ్యాయి. నోట్ల రద్దు అనంతరం నవంబర్‌లో ఆస్తి పన్నులు రూ.52 లక్షలు వసూలైతే.. తాగునీటి పన్ను రూ.9.50 లక్షలు వసూలైంది. అక్టోబర్‌తో నవంబర్ వసూళ్లను పోల్చుకుంటే ఆస్తి పన్ను నాలుగు రెట్లకు పైగా పెరిగితే... తాగునీటి పన్ను దాదాపు 11 రెట్లు పెరిగింది. అంటే మొత్తం పన్నుల డిమాండు రూ.3.37 కోట్లలో ఒక్క నవంబర్‌లోనే నాలుగో వంతు వసూలైనట్లయింది.
అమలాపురం టౌ¯ŒS
అక్టోబర్‌లో కన్నా ఆరు రెట్లు
పెద్ద నోట్ల రద్దు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కాసుల వర్షాన్ని కురిపించింది. రూ. వెయ్యి, రూ. 500 నోట్లతో ఇంటి పన్నులు, కుళాయి పన్నుల బకాయిలు చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మునుపెన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థకు భారీగా ఆదాయం వచ్చింది. వ్యాపారస్తులు, ఇంటి యజమానులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఆస్తి, వ్యాపార పన్నులు చెల్లించారు. పెద్దనోట్లు రద్దు అయిన నవంబర్ 8 నుంచి 30 వరకు నగరపాలక సంస్థకు పన్నులు, బకాయిలు రూపంలో రూ.6.31 కోట్లు సమకూరాయి. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 7 వరకు కేవలం రూ.86.80 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. నవంబర్‌లో నగరపాలక సంస్థ ఆదాయం మునుపటి నెలకన్నా ఆరు రెట్లకు పైగా పెరగడం విశేషం. నగరపాలక సంస్థను ఎప్పటి నుంచో వేధిస్తున్న మొండిబకాయిల వసూలు బాధ పెద్దనోట్ల రద్దు వల్ల తీరినట్టయింది.
– రాజమహేంద్రవరం
రామచంద్రపురానికి కలిసొచ్చిన ‘రద్దు’
పెద్ద నోట్ల రద్దు అనంతరం రామచంద్రపురం మున్సిపాలిటీకి రూ.22 లక్షల ఆస్తిపన్ను వసూలయింది. నోట్లు రద్దు చేసిన మూడవ రోజే రూ. 10 లక్షలువసూలు కావటం గమనార్హం. అక్టోబర్ నెలలో రూ.4,41,924 వసూలు కాగా ఒక్క నవంబర్‌లో మొత్తం రూ.22,04,773 వసూలయ్యింది. సాధారణంగా నవంబర్‌లో రెండు నుంచి మూడు లక్షల వరకు మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతుంది. కానీ ఈసారి పెద్దనోట్ల రద్దుతో ఆ మొత్తం అనేక రెట్లు పెరిగింది.
– రామచంద్రపురం
రెండు మున్సిపాలిటీల్లో దండిగా..
పెద్ద నోట్ల రద్దు పెద్దాపురం నియోజక వర్గ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలకు వరంగా మారింది. పెద్దాపురం మున్సిపాలిటీలో ఏడాది మొత్తం పన్ను డిమాండ్ రూ.2,50,00,000 అని మున్సిపల్ కమిషనర్ ఎ. వెంకట్రావు తెలిపారు. అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.5,02,500, కుళాయి పన్నులుగా రూ.3,66,600, షాపుల అద్దెలుగా రూ.48 వేలు వసూలు కాగా నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.21,39,600, కుళాయి పన్నుగా రూ. 6,65,900, షాపుల అద్దెలుగా రూ.6,16,900 వసూలైనట్టు చెప్పారు. నోట్ల రద్దుతో నవంబరు నెలలో రూ.25,32,700 అదనంగా ఆదాయం వచ్చింది.
సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం పన్ను డిమాండ్ రూ.2, 55,75,000 కాగా అక్టోబరు నెలలో ఇంటి పన్నులుగా రూ. 3.51 లక్షలు, కుళాయి పన్నుగా రూ.99 వేలు, షాపుల అద్దెలుగా రూ.2,61,000 వసూలైనట్టు కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. నవంబరు నెలలో ఇంటి పన్నులుగా రూ.15.77 లక్షలు, కుళాయి పన్నుగా రూ.4.30 లక్షలు, షాపుల అద్దెలుగా రూ.2.38 లక్షలు వసూలు అయినట్లు తెలిపారు. – సామర్లకోట
నవంబర్‌లో రూ.25 లక్షల రాబడి
రద్దయిన పెద్దనోట్లతో పన్ను బకాయిలు చెల్లించవచ్చని చెప్పడంతో పిఠాపురం పురపాలక సంఘానికి ఆదాయం భారీగా పెరిగింది. గడిచిన అక్టోబర్‌లో ఆస్తిపన్ను వసూలు కేవలం సుమారు రూ.8 లక్షలుండగా పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలుబడిన నవంబర్‌లో సుమారు రూ.25 లక్షలు ఆస్తిపన్ను, కుళాయి పన్నుల రూపంలో వసూలయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.53 కోట్లు ఉండగా ఇంతవరకు రూ.1.82 కోట్లు వసూలయినట్టు తెలిపారు.
– పిఠాపురం టౌ¯ŒS
మండపేటలో రికార్డుస్థాయి..
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మండపేట మున్సిపల్ పరిధిలో రికార్డుస్థాయిలో పన్నులు వసూలయ్యాయి. ఆస్తిపన్నుగా రద్దయిన నోట్లను చెల్లించుకునేందుకు అవకాశమివ్వడంతో పెద్ద ఎత్తున భవన యజమానులు పన్నులు చెల్లించారు. ఏడాదికి మునిసిపాలిటీ ఆస్తిపన్ను డిమాండ్ రూ.2.74 కోట్లు కాగా ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.1.79 కోట్లు. దీనిలో రూ.57 లక్షలు పెద్దనోట్లు రద్దు తర్వాత వసూలైందే కావడం గమనార్హం. అక్టోబరు నెలలో కేవలం రూ. 9.63 లక్షలు వసూలయ్యాయి. సాధారణంగా నవంబరులో ఆస్తిపన్ను వసూలు దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. – మండపేట