మున్సిపల్ భవనంలోనే జనగామ కలెక్టరేట్
-
సమీకృత బాలుర వసతి గృహంలో ఐదు శాఖలు
-
పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ
జనగామ : జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పురపాకల సంఘంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. దసరా పండుగ రోజున కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. ఈమేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించేందుకు కలెక్టర్ వాకాటి కరుణ గురువారం జనగామకు వచ్చారు. జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆర్డీవో వెంకట్‌రెడ్డితో కలిసి చంపక్‌హిల్స్‌లో నూతనం గా నిర్మిస్తున్న వంద పడకల ప్రసూతి ఆస్పత్రి, పెంబర్తి ప్రగతి ఫార్మసీ, వడ్లకొండ ఇరిగేషన్ క్వార్టర్లు, ఆర్డీవో క్వార్టర్లను కలెక్టర్ పరి శీలించారు. అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మకంచలోని సమీకృత బాలుర వసతిగృహంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీతోపాటు మరోశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మూడు రోజుల్లో 19 శాఖలకు చెందిన భవనాలను గుర్తించి ఫర్నీచర్ పంపుతామని తెలిపారు. మున్సిపల్ భవనంతోపాటు సమీకృత వసతిగృహంలో టాయిలెట్స్, నీటి వసతి, విద్యుత్, ఎలక్టిక్రల్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా వచ్చింది.. చాలా సంతోషంగా ఉందా..
జనగామ జిల్లా సాధించుకున్నారు.. చాలా సంతోషంగా ఉందా.. అంటూ కలెక్టర్ కరుణ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. మేడమ్ జిల్లా సాధించుకున్నాం.. మీరే కలెక్టర్‌గా రావాలంటూ ఓ నాయకుడు అనడంతో చిరునవ్వుతో సమాధానం చెప్పారు. వారి వెంట జేఏసీ చైర్మన్ ఆర్టుల దశమంతరెడ్డి, కౌన్సిలర్లు కన్నారపు ఉపేందర్, ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ బాల్దె సిద్దులు, డాక్టర్ లక్షి్మనారాయణనాయక్, ఆకుల సతీష్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా ఉన్నారు.