దోసపాడు సర్పంచ్ దంపతులపై దాడి
పెదపారుపూడి :
మండలంలోని దోసపాడు సర్పంచ్ మాయ సత్యనారాయణ, అతని భార్య లక్ష్మీదుర్గపై కొంతమంది వ్యక్తులు దాడిచేసి గాయపరిచిన సంఘటన దోసపాడు శివారు తమ్మలంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. గుడివాడ ఏరియా ఆస్పత్రి అవుట్ పోలీసులు తెలిపిన వివరాలు... దోసపాడు శివారు తమ్మలంపాడులో కొద్దిరోజుల కిందట కుర్మ కులానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి పెద్దకర్మకు కొంతమొత్తం ఇవ్వాలని కుల సంఘ నాయకులు నిర్ణయించారు. సంఘ నాయకులు కుమ్మరి రాజేష్, మరికొందరు అదే కులానికి చెందిన సర్పంచ్ మాయ సత్యనారాయణ వద్దకు వచ్చి చందా అడిగారు. చందా ఇవ్వటం కుదరదని సర్పంచ్ చెప్పడంతో వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం సర్పంచ్ దోసపాడు నుంచి బైక్‌పై తమ్మలంపాడులోని తన ఇంటికి వస్తున్నాడు. స్థానిక ఆంజనేయస్వామి గుడి సమీపంలోకి రాగానే గ్రామానికి చెందిన కుమ్మరి రాజేష్, అతని తండ్రి విష్ణువర్థనరావు, రాజేష్ భార్య రేణుక, తల్లి కుమారిలు బైక్ ఆపి కత్తులతో దాడి చేశారు. సమీపంలోనే సర్పంచ్ ఇల్లు ఉండడంతో అతని భార్య లక్ష్మీదుర్గ అడ్డు వచ్చింది. ఆమె పైనా దాడిచేశారు. ప్రసుత్త సర్పంచ్, అతని భార్య గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదును పెదపారుపూడి పోలీస్‌స్టేషకు పంపుతున్నట్లు అవుట్ పోలీస్ ఏఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు తెలిపారు.