ఆధిపత్యం కోసమే హత్య
– పి.రుద్రవరం రాముడు మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
– బోగస్ నంబర్ సుమో, సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితుల గుర్తింపు
– బోయ కృష్ణ, బోయ విక్రమ్‌తో సహా ఏడుగురు నిందితుల అరెస్టు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం నాయకుడు కర్నూలు మండలం పి.రుద్రవరం గ్రామానికి చెందిన కురువ రాముడు హత్యకేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణ, విక్రమ్, దాసి బాలరాజు, బోయ లక్ష్మన్న, బోయ నల్లబోతుల ఎర్రమల, బోయ నల్లబోతుల రాజు, బోయ నల్లబోతుల మద్దిలేటి, అరుణ్‌గౌడ్ కలిసి హత్య చేసినట్లు తేలింది. అనుమానితుల కాల్‌డేటా, హత్యకు వినియోగించిన బోగస్ నంబర్ సుమో ఆధారంగా వారిని గుర్తించారు. నిందితుల్లో అరుణ్‌గౌడు పరారీలో ఉండగా మిగిలిన ఏడుగురిని పోలీసులు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట ఆదివారం హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు... 2016 డిసెంబర్ ఆరో తేదీన రాత్రి పి.రుద్రవరం గ్రామానికి చెందిన మిట్టగిరి కురువ రాముడు బి.తాండ్రపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాల్వ గట్టుపై దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు నుంచి పనులు ముగించుకుని బజాజ్ పల్సర్ బైక్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాముడిని సమోతో గుద్దించి, ఆ తరువాత రాడ్లు, కత్తులతో పొడిచి హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన బోయ కృష్ణ, బోయ విక్రమ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
జిల్లాలో చాలా రోజుల తరువాత ఫ్యాక‌్షన్ హత్య జరగడంతో జిల్లా ఎస్పీ అకే రవికృష్ణ సీరియన్ స్పందించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బృందానికి విచారణ బాధ్యతలను అప్పగించారు. హత్య కోసం వినియోగించిన ఏపీ04ఏక్యూ2326 అనే నంబర్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా సుమో ఎవరిదనే దానిపై వారు దృష్టి సారించారు. ఈ వాహనం ఓనర్ అయిన సదాశివపేటకు చెందిన రవితేజను విచారించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన పవన్, రాజు అనే వ్యక్తులు తన సుమోను 83 వేలకు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిపాడు. ఇదిలా ఉండగా మృతుడు కురువరాముడు డిసెంబర్ 06వ తేదీన తిరిగిన, చనిపోయిన ప్రదేశాల్లో టవర్ డంప్ ఆధారంగా కొన్ని అనుమానిత ఫోన్ కాల్స్ జాబితాను తీసుకుని విచారణ చేయగా నిందితుల వివరాలు బయటపడినట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ వివరించారు. గతంలో రుద్రవరం గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్ అనే వ్యక్తిని బోయ కృష్ణ, అరుణ్‌గౌడ్ కలిసి చంపగా కురువ రాముడు బేతంచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారని, అంతేకాక గ్రామంలో ఆయనే ఆధిపత్యాన్ని చెలాయిస్తుండడంతో హత్య చేసినట్లు నిందితులు తెలిపినట్లు ఎస్పీ వివరించారు. నెలన్నరరోజుల్లో కేసును ఛేదించడంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ సి.మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు గిరిబాబు, వి.సుబ్రమణ్యంరెడ్డి, ఇతర పోలీసులను ఎస్పీ అభినందించారు. రిమాండ్ నిమిత్త జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. సమావేశంలో ఓఎస్‌డీ రవిప్రకాష్ పాల్గొన్నారు.