
బంగారం కోసమే హతమార్చారు
మాజీ కార్పొరేటర్ హంతకుల అరెస్ట్
ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : నగరంలోని అల్లిపురం మార్కెట్ ప్రాంతంలో సంచలనం సష్టించిన టీడీపీ మాజీ కార్పొరేటర్ చిల్లా సత్యవతి (70) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారంపై ఆశతో ఆ ఇంటి మేడపై అద్దెకు ఉంటున్న దంపతులే హతమార్చారని, వారికి ఓ మైనర్ బాలుడు సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను శాంతి భద్రతల డీసీపీ నవీన్ గులాఠీ వెల్లడించారు. అల్లిపురం మహాత్మాగాంధీ మార్కెట్‌కు ఎదురుగా ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న సత్యవతి ఈ నెల 13న రాత్రి హత్యకు గురైంది. ఆమెకు కుమార్తె వరుసైన దాసరి కనకమహాలక్ష్మి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగర నేరపరిశోధన విభాగం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా సత్యవతికి తోడుగా ఉండే పప్పులమ్మ రామలక్ష్మిని ముందుగా విచారించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. చివరకు అదే ఇంటి పై భాగంలో అద్దెకు ఉంటున్న దంపతులు సంగు నాగరాజు (25), సంగు పద్మ (24) సత్యవతిని హత్య చేసినట్టు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత మృతురాలి చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు, బంగారు చైన్‌తో పాటు రూ.10,500 నగదు దొంగిలించారని నిర్ధారించారు.
బంగారంపై ఆశతోనే...
పెళ్లైన కొత్తలోనే భర్తను కోల్పోయిన సత్యవతి అల్లిపురం మార్కెట్ సమీపంలో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన పప్పు లు అమ్ముకునే రామలక్ష్మి అనే మహిళ తోడుగా ఉంటుండేది. సత్యవతి నివాసం ఉంటున్న భవనం రెండో అంతస్తులో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 15 మంది క్యాటరింగ్ వర్కర్లు అద్దెకు ఉంటున్నారు. అదే భవనం రెండో వైపున నిందితులు తమ ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. అదేవిధంగా 17 సంవత్సరాల మైనర్ బాలుడు పేయింగ్ గెస్ట్‌గా మరో గదిలో ఉంటున్నాడు. నిందితుల పది సంవత్సరాల కుమారుడు హత్య జరగడానికి ముందు రెండు రోజుల నుంచి సత్యవతి గదిలో ఆమెకు తోడుగా నిద్రిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమె బంగారంపై కన్నేసిన నాగరాజు, పద్మ దంపతులు 13న రాత్రి హత్యకు పాల్పడ్డారు. ఇందుకు వారికి ఓ మైనర్ బాలుడు సహకారం అందించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 14న ఉదయం 11 గంటల సమయంలో సత్యవతి హత్యకు గురైన విషయాన్ని కేటరింగ్ యువకులతో పాటు స్థానికులు గుర్తించారు.
విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్లో సంగు నాగరాజును కురుపాం మార్కెట్ వద్ద, అతడి భార్య పద్మను ఇంట్లో, మైనర్ బాలుడిని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 తులాల బరువున్న నాలుగు బంగారు గాజులు, చైన్‌తో పాటు రూ.10,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. విలేకరుల సమావేశంలో ఏడీసీపీ వరదరాజులు, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, క్రై ం ఏసీపీ ఫల్గుణరావు, సీసీఎస్ ఏసీపీ గోవిందరావు, రెండో పట్టణ పోలీసులు పాల్గొన్నారు.