ముస్లిం పర్సనల్ లాలో ప్రభుత్వ జోక్యం తగదు
విజయవాడ(లబ్బీపేట) : ముస్లిం పర్సనల్ లా విషయంలో ప్రభుత్వం జోక్యం తగదని, ముస్లిం పర్సనల్ లా(షరియత్)లో ఎలాంటి మార్పు చేర్పులకు అవకాశం లేదని ఖాజి ఎ షరియత్ ముఫ్తీ సయ్యద్ అబ్దుల్ రహీం అన్నారు. ముస్లిం పర్సనల్ లాపై కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఆలిండియా పర్సనల్ లా పెద్దల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మసీదుల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం నగరంలోని ముస్లిం పర్సనల్ లా కార్యాలయంలో పలువురు మత పెద్దలు సమావేశమయ్యారు. యూత్ వెల్పేర్ అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ మాట్లాడుతూ భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సాంప్రదాయాల సమూహమని, అలాంటి మన దేశంలో అందరికీ ఒకే పద్ధతి, ఒకే సంప్రదాయాల్లో కట్టడి చేయాలన్న ఆలోచన చేయడం శోచనీయమన్నారు. ఇమారత్ ఎ షరియా అధ్యక్షుడు ముఫ్తీ సయ్యద్ మొహసీన్ మాట్లాడుతూ ముస్లిం లా బోర్డు పెద్దల ఆదేశాలను శిరసావహిస్తూ సంతకాల సేకరణలో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. ఈనెల 23న వన్‌టౌన్ పంజా సెంటర్, సనత్‌నగర్ రేకుల మసీదు సెంటర్‌లలో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ముఫ్తి మహమ్మద్ అజహార్, ముఫ్తి మహమ్మద్ అన్సార్, ముఫ్తి మహమ్మద్ రియాజుద్దీన్, వాహిదుల్లా, మఖ్బూల్, సయ్యద్ వలిబాషా తదితరులు పాల్గొన్నారు.