ఔను నా రూటే సపరేటు..!
ఔను నా రూటే సపరేటు..!
Published Wed, Aug 16 2017 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
సాక్షి కథనంపై మంత్రి జవహర్ అక్కసు
జిల్లా వేడుకలకు పోటీగా కొవ్వూరులో జెండా ఆవిష్కరణ
వచ్చే ఏడాది మరింత ఘనంగా చేస్తామని ప్రకటన
ఆర్డీఓను వెనకేసుకొచ్చిన మంత్రి
పోటీ కార్యక్రమంపై ప్రభుత్వానికి నిఘావర్గాల నివేదిక
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
’ఔను.. నా రూటే సపరేటు..? వచ్చే ఏడాది కొవ్వూరులో వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహిస్తాను. సాక్షి ప్రతికలో వచ్చిన కథనాన్ని అందరూ ఖండించాలి’ అంటూ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్వాతంత్ర వేడుకలకు పోటీగా కొవ్వూరులోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ సాక్షి మంగళవారం కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం లక్షలాది రూపాయలు సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో ఆయా విభాగాల అధికారులు ఆందోళనను సాక్షి కథనంలో ప్రతిబింబించింది. కథనంలోని అంశాలకు ఏ మాత్రం వివరణ ఇవ్వని మంత్రి జవహర్ సాక్షిపై తన అక్కసు వెళ్లగక్కారు. ’అదో దొంగ పత్రిక , ’సాక్షి’ని బహిష్కరించండి’ అంటూ మండిపడ్డారు. పాపం ఆర్డీఓను ఇబ్బంది పెట్టేలా వార్త రాశారంటూ ఆయనపై జాలి చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవాలు ఎక్కడైనా, ఎవరైనా చేసుకోవచ్చునని, కనీస అవగాహన లేకుండా రాసిన రాతలను ఖండించాలని సూచించారు. వచ్చే ఏడాది ఇంత కంటే ఘనంగా నియోజకవర్గ స్థాయిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వంతపాడారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేస్తే బావుంటుందని సూచించారు.
ఆనవాయితీ ఇదీ..
వాస్తవానికి ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకుని జిల్లా కేంద్రంలో అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలను ఏటా నిర్వహించడం ఆనవాయితీ. ఇక గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, వాడవాడలా వేడుకలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ కార్యాల యాల్లో ఆయా శాఖ అధికారులు వేడుకలు చేస్తారు. ఇంత వరకు నియోజకవర్గస్థాయిలో ఉత్సవాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మంత్రి జవహర్ మాత్రం కొత్త భాష్యం చెబుతూ ఆయన నియోజకవర్గంలో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇదే విషయమై ’సాక్షి’ ’నా రూటే సపరేటు’ అన్న శీర్షీకతో కథనం ప్రచురించింది. మంగళవారం కొవ్వూరులో తప్ప ఎక్కడా నియోజకవర్గస్థాయిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించ లేదు. మంత్రి తన ఇలాకాలోని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ వేడుకలు ఏర్పాటు చేశారనే విమర్శలు ఉన్నాయి.
నిధులెక్కడివి?
ప్రభుత్వం నియోజకవర్గస్థాయి వేడుకలకు పైసా నిధులు ఇవ్వలేదు. అయినా డివిజన్‌స్థాయి అధికారి అయిన ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రాలు ముద్రించి మరీ అధికారులను, రాజకీయ పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చుచేశారు. గృహనిర్మాణ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు శకటాలు ఏర్పాటు చేశాయి. భారీ ఎత్తున టెంట్లు, కుర్చీలు, బారీకేడ్లు, స్టాళ్లు ఏర్పాటుచేశారు. వచ్చిన వాళ్లకు డ్రింకులు, వాటర్ బాటిళ్లు ఇచ్చారు. వ్యవసాయశాఖ ద్వారా అందించే సబ్సిడీ యంత్రాలు, ట్రాక్టర్లు అన్నీ ఇక్కడికి తరలించారు. వీటి కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వ పరంగా నిధులు ఏమీ కేటాయించనప్పుడు ఇవన్నీ ఎలా నిర్వహించారన్న దానిపై అధికారులు నోరుమెదపడం లేదు.
నిఘావర్గాల నివేదిక
ప్రభుత్వం అధికారికంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకలకు పోటీగా మరోమంత్రి తన నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించడంపై ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ఆరాతీసినట్టు సమాచారం. మరోవైపు నిఘా విభాగాలు కూడా ఇక్కడ జరిగిన తంతుపై పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందచేసినట్టు సమాచారం.
రాజకీయ సభను తలపించింది
సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకోవడం, రాష్ట్ర, దేశాభివృద్ధికి తీసుకునే అంశాలను వెల్లడించడం పరిపాటి. మంత్రి కేఎస్ జవహర్ మాత్రం స్వాతంత్య్ర వేడుకను రాజకీయ సభలా మార్చేశారు. ఆయన ప్రసంగమంతా తన పార్టీని పొగడడానికే ఉపయోగించారు. వేదికపై మంత్రి జవహర్ సతీమణి, ఉపాధ్యాయురాలైన ఉషారాణి, ఆయన కుమార్తె ఆశీనులయ్యారు.
Advertisement