విడగొట్టాక.. తొడగొట్టారు
విడగొట్టాక..
తొడగొట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న’ సామెతను తలపిస్తోంది జిల్లాలోని పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల తీరు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది మొదలు సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడే వరకు రాజీనామాలంటూ డ్రామాలాడారు.
విభజనపై సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)లో నిర్ణయం తీసుకున్నప్పుడే పదవులకు, పార్టీకి రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశమే ఉండేది కాదని జనం ఆక్షేపిస్తున్నారు. అధికారం కోసం పదవులను పట్టుకుని వేలాడే నాయకులు ఇప్పుడు రాజీనామా చేయడం ఎం దుకని ప్రశ్నిస్తున్నారు. విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదించడంపై కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. విభజనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కె.గంగవరం మండలంలో మంగళవారం సాయంత్రం ప్రకటించారు. రెండు రోజుల ముందు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాజీనామా చేసిన విషయం విదితమే.
సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి పళ్లం రాజు, రాజమండ్రి, అమలాపురం ఎంపీ లు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, కురసాల కన్నబాబు, పాముల రాజేశ్వరిదేవి, రాజా అశోక్‌బాబు, రాపాక వరప్రసాద్ తదితరులు పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీ నామా చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఆచరణలో మాత్రం అవన్నీ ఉత్తుత్తి రాజీ నామాలేనని తేలిపోయింది. సోనియా బుజ్జగింపులతో ప్రజల భావోద్వేగాలను పక్కనబెట్టి పళ్లంరాజు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాక ఇప్పుడు జిల్లా ప్రజాప్రతినిధులు మరోసారి రాజీనామా డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సమైక్యవాదులు ఆక్షేపిస్తున్నారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇప్పుడు రెండోసారి చేస్తున్న రాజీనామా వల్ల ఒరిగేదేమీ లేదని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రాజీనామా చేసినట్టు ప్రకటించి తీరా ఢిల్లీ వెళ్లేసరికి మనసు మార్చుకుని తన నైజాన్ని బయటపెట్టారని పళ్లంరాజుపై నిప్పులు చెరుగుతున్నారు. ఢిల్లీలో అధికారికంగా కేటాయించిన ఇంటినుంచే ఫైళ్లను క్లియర్ చేసిన పళ్లంరాజు మరోసారి రాజీనామా అంటే విశ్వసించే పరి స్థితి కనిపించడం లేదు. రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున ఎలాగూ పదవి పోతుందని తెలిసే తాజా రాజీనామా డ్రామా ఆడుతున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. రాజీ నామా చేసినవారంతా రాజకీయ స్వార్థం కోసం మాత్రమే రాజీనామా చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో కొనసాగితే రాజకీయంగా బతుకు బస్టాండైపోతుందనే బెంగతోనే రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బండారు రాజీనామా చేయడం, వెనువెంటనే తాను ఒకప్పుడు వద్దనుకుని వచ్చేసిన టీడీపీలో చేరడాన్ని ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.