డిఫాల్టర్స్!
♦ ఇద్దరు డీసీసీబీ డెరైక్టర్లను
♦ వెంటాడుతోన్న నాబార్డు అప్పులు
♦ వాస్తవాలను మరుగుపర్చిన డీసీఓ కార్యాలయం
♦ సభ్యత్వం కోల్పోతాం...కాపాడండీ...:
♦ ఓ మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన వైనం
♦ ఆపై అండగా నిలుస్తోన్న డీసీసీబీ యంత్రాంగం
ఆ ఇద్దరు డీసీసీబీ డెరైక్టర్లు. హ్యాండ్లూమ్స్ కోసం వీవర్స్ సొసైటీల పేరుతో రుణాలు తీసుకున్నారు. రూ.లక్షో.. రెండు లక్షలో కాదు ఏకంగా రూ.కోట్లలో రుణాలు తీసుకున్నారు. తర్వాత ఆ రుణాలను చెల్లించకుండా మొండికేశారు. దీనిని అధికారికంగా ధ్రువీకరిస్తే పదవులు కోల్పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో తమను తాము కాపాడుకునేందుకు గాడ్‌ఫాదరైన మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆపై అధికార యంత్రాంగం మద్దతు లభించింది. ఇంకేముంది డిఫాల్ట్ వ్యవహారాన్ని డీసీఓ కార్యాలయ వర్గాలు తొక్కిపెట్టేశారు.
సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబీకే మచ్చతెచ్చే వ్యవహారమిది. డెరైక్టర్లు ఇద్దరు చేనేత సహకార సంఘాలకు ఆప్కాబ్, నాబార్డు ద్వారా హ్యాండ్లూమ్స్ ఏర్పాటుకు రుణాలు తీసుకున్నారు. చేనేత కుటుంబాలకు రుణాలు ఇవ్వకుండా స్వాహా చేయడమే కాకుండా, సబ్సిడీ పోనూ తక్కిన రుణం చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇద్దరు డెరైక్టర్ల పరిధిలో సుమారు రూ.2.5కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఒక్కరిదే దాదాపు రూ.2కోట్లు ఉన్నాయి. కాగా రుణాల గోల్‌మాల్‌ను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. కొందరు చేనేత సంఘాల నేతలు ఆప్కాబ్, నాబార్డులతోపాటు, డీసీఓ, డీసీసీబీలకు సైతం ఫిర్యాదు చేశారు. డీసీసీబీలో డెరైక్టర్లుగా ఉన్న ఆ ఇద్దరు డిఫాల్టర్స్‌గా ఉన్నారని చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
మాజీ ఎమ్మెల్యే సిఫార్సులతో...
డీసీసీబీ డెరైక్టర్లపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో విచారణ చేయాల్సిన యంత్రాం గం వారికే కొమ్ముకాస్తోంది. అందుకు ఉదాహరణ డీసీసీబీ యంత్రాంగం నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డెరైక్టర్లకు వారిపై వచ్చిన ఫిర్యాదుల ప్రతులను అందజేయడమే. ఆ వెంటనే పాలకమండలికి గాడ్‌ఫాదర్‌గా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేను డెరైక్టర్లు ఆశ్రయించినట్లు తె లుస్తోంది. ‘ఇదివరకు మీకు అండగా నిలి చాం. చైర్మన్ గిరీ కైవసం చేసుకునేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాం. తాజా పరిణామాల నేపథ్యంలో మీతోడ్పాటు అవసరం. మీరే ఈ గండం నుంచి గట్టెక్కించాలి’ అని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు డెరైక్టర్లకు అభయమిచ్చిన మాజీ ఎమ్మెల్యే డీసీసీబీ యంత్రాం గానికి, డీసీఓ కార్యాలయ వర్గాలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇంకేముం ది రికార్డులు పరిశీలించి ఆ డెరైక్టర్లు డిఫాల్టర్స్ అవునా కాదా? అన్న విషయాన్ని నిగ్గుతేల్చాల్సిన డీసీఓ కార్యాలయం నిర్లక్ష్యం చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేకాధికారుల విచారణ.....
డీసీసీబీ డెరైక్టర్లు ఇద్దరు డిఫాల్టర్స్‌గా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆప్కాబ్, నాబార్డు విభాగాలకు చెందిన ప్రత్యేకాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు చేనేత సహకార సంఘాల నిర్వహణ తీరుతెన్నులు, రుణాలు స్వాహా వైనంపై ఆరా తీసినట్లు సమాచారం. వ్యవహారం ఎటొచ్చి ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి అంతవరకూ వేచిచూడాలనే ధోరణిలో డీసీసీబీ పాలకమండలి ఉన్నట్లు సమాచారం.
వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంది
నా పరిశీలనలో డీసీసీబీ డెరైక్టర్లపై ఫిర్యాదు రాలేదు. కర్నూల్ డీసీఓగా ఉన్న నేను మూడునెలల క్రితమే ఎఫ్‌ఏసీ బాధ్యతలు తీసుకున్నాను. దీనిపై వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంది. కార్యాలయానికి ఫిర్యాదు వచ్చిన విషయం కూడా నాకు సిబ్బంది తెలపలేదు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తాను. - డీసీఓ సుబ్బారావు