
ఈ వరం ఎన్నడు సాకారం ?
సాగర్ జలాశయ విస్తీర్ణం : 110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం : 590 అడుగులు
డెడ్ స్టోరేజి లెవల్ : 490 అడుగులు
నిల్వ నీరు : 408 టీఎంసీలు
డెడ్ స్టోరేజి నీరు : 168 టీఎంసీలు
లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ అన్నదాతల పాలిట జీవనధారగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ జలాశయం మన రాష్ట్రానికే మకుటాయమానం. ఆనాడు జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఎంతోమంది మహనీయుల కలల వారధిగా నిర్మితమైన సాగర్ నేటికీ వారి లక్ష్యాలను చేరలేదనే చెప్పాలి. ఆయకట్టు చివరి వరకూ నీరందించాలనే ముఖ్యుల ఆశయ సాధనకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేసినా ఆయన మరణానంతరం చతికిలపడింది. నేటికి (గురువారం) నాగార్జున సాగర్‌కు శంకుస్థాపన చేసి 60ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం.
నెరవేరని సాగర్ లక్ష్యం
చివరి భూమి వరకూ నీరు ఎప్పటికి చేరేను?
నేటికి 60ఏళ్లు పూర్తి
విజయపురి సౌత్/మాచర్ల : నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి గురువారానికి 60ఏళ్లు. కోట్లాదిమంది ప్రజలకు జీవనాధారంగా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తిస్థాయి మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు ఇది. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలు కూడా నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్‌బహుదూర్ కాలువగా పిలుస్తారు.
కాలువలే సాగుకు ప్రధానం
జవహర్ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956, అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద సొరంగమార్గం ద్వారా ఈ కాలువ ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిపై ఆధారపడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 20లక్షల 62వేల ఎకరాలు సాగవుతోంది. ఇక లాల్‌బహుదూర్ కెనాల్ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని నాటి గవర్నర్ భీమ్‌సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. పొడవు 349 కిలోమీటర్లు. దీనిపై ఆధారపడి 14లక్షల 50వేల ఎకరాలు సాగవుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి కాలువలాగే ఈ కాలువకూ నీరు విడుదల చేయవచ్చు. దీని నిర్మాణానికి సుమారు రూ.675 కోట్లు వ్యయమైనట్టు అంచనా. సాగర్ ప్రాజెక్టు కింద ఏడాదికి సగటున కనీసం రూ.1,500 కోట్ల విలువైన వ్యవసాయం సాగవుతోందని అంచనా. ఆగస్టు 4, 1967న నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు.
పూడిక నిండటంతో చాలని నీరు
నాగార్జున సాగర్‌తో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలోకి పూడిక చేరడంతో ఒకసారి నిండితే గానీ రెండు పంటలకు నీరు సరిపోవట్లేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి నిర్మించటం, కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం లేకపోవటం, సాగునీటిశాఖ అధికారుల ప్రణాళికలు లేకపోవడంతో తాగునీరు పేరుతో నీరు విడుదల చేస్తున్నారు.
కన్నీటి సాగునీరు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పరిధిలో 22 లక్షల ఎకరాలను సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది కనీసం రెండు లక్షల ఎకరాలకు కూడా నీరందలేదు. దీంతోపాటు కృష్ణాడెల్టాకు నీరు విడుదల కాకపోవటంతో మరో ఐదు లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి. నాడు సాగర్ రిజర్వాయర్ నుంచి ఏటా కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయ్యేది. నేడు కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. నాడు సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రాజెక్టు నిర్దేశిత విధానం ప్రకారం సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరలేదు. ఆనాటి అద్భుత కట్టడమైన బహుళార్థక ప్రాజెక్టు సాగర్ నేడు హైదరాబాద్ మంచినీటి అవసరాలు, ఎస్‌ఎల్‌బీసీకి నీటి విడుదల, కుడి, ఎడమ కాలువలకు తాగునీరుకే పరిమితమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీటి లక్ష్యాలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు, కూలీలు, ఆయకట్టు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
నెరవేరని వైఎస్ కల
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కాలువల సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిని నేడు చివరి భూముల వరకూ నీరందని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగర్‌లో స్వర్ణోత్సవాలు జరిపారు. చివరి ఎకరం వరకూ కాలువల ద్వారా నీరు అందాలని భావించిన ఆయన ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడంతో పాటు ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచాలనే ఉద్దేశంతో పనులు చేపట్టారు. ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాకపోయినా ఆధునికీకరణ పనులు మొదలుపెట్టారు. వైఎస్ మరణం తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరైనా పనులు నేటికీ నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతు హిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం
(నాగార్జున సాగర్ శంకుస్థాపన సందర్భంగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యలు)