
రూ. 52 వేల పలుకుతున్న నాగపూర్ మేకపోతు
సాక్షి, సిటీబ్యూరో: ఫారూఖ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గొర్రె పొట్టేళ్ల విక్రయ కేంద్రాల్లో నాగపూర్‌కు చెందిన మేకపోతు అందరినీ ఆకట్టుకుంటుంది. భారీ శరీరాకృతి కలిగి పెద్ద చెవులు ఉన్న ఈ మేకపోతును చూసి కొనుగోలు చేసేందుకు పాతబస్తీ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. 60నుంచి 70 కిలోల బరువు తూగే ఈ మేకపోతు ధరను యజమాని నబీ రూ. 52 వేలుగా నిర్ణయించాడు. ఈ పోతుకు తల్లిపాలు సరిపోకపోవడంతో ఆవు పాలు పోసి పెంచినట్లు యజమాని తెలిపాడు.
నగరంలో బక్రీద్ పొట్టేళ్లు సందడి చేస్తున్నాయి. మరో రెండురోజుల్లో పండుగ ఉండటంతో గొర్రెలు, మేకపోతులు, పొటేళ్లు నగరానికి తరలి వచ్చాయి. నగరంలోని రోడ్డుకిరువైపుల వ్యాపారులు విక్రయాలు చేపట్టారు.కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాట్లు చేయించారు. గతేడాది సుమారు ఆరు వందల కోట్లకు పైగా వ్యాపారం జరగ్గా, ఈసారి అంతకు మించవచ్చునని వ్యాపారులు పేర్కొంటున్నారు.