కిడ్నీ రాకెట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
-కొలంబోలోని మూడు ఆస్పత్రుల్లో నెట్‌వర్క్
-ఒక్కో కిడ్నీకి రూ.25 లక్షలు
- ఖర్చు పోనూ దాతకు ఇచ్చేది రూ. 5లక్షలు
- రాకెట్ ఏజెంట్‌తో సహా ముగ్గురు బాధితుల అరెస్టు
- కారు, ఏటీఎం కార్డు, పాస్‌పోర్టుల స్వాధీనం
- సాక్షి కథనాలతో వెలుగులోకి..
నల్లగొండ: నల్లగొండ జిల్లా కిడ్నీ రాకెట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటర్ నెట్ ద్వారా అమాయకులకు ఎరవేసి జాతీయస్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
జిల్లా కేంద్రంలో సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, బెంగాల్‌లో నలుగురు, హైదరాబాద్‌లో నలుగురు, తమిళనాడులో ఇద్దరు, ముంబైలో ఒక్కరు, న్యూఢిల్లీలో ఒక్కరు చొప్పున కిడ్నీలను అమ్మించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని ఏజెంటు కస్పరాజు సురేష్ (22) తన కిడ్నీని అమ్ముకుని ఏజెంటుగా మారి 15 మంది కిడ్నీలను వివిధ ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలిపారు. అయితే అవసరమున్న వారు ఒక్కో కిడ్నీకి రూ. 25 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. దాంట్లో కిడ్నీ దాతకు అన్ని ఖర్చులు పోను రూ. 5లక్షలు చెల్లిస్తారని వివరించారు. ఈ రాకెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక, న్యూఢిల్లీ, బెంగాల్, ముంబై, కొలంబో ప్రాంతాలకు సంబంధాలున్నాయని వివరించారు.
అమయాకులను ఎరవేసి విజిటింగ్ విసా పేరిట కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్‌తో పాటు జిల్లా కేంద్రానికికే చెందిన మరో ముగ్గురు ఎం.డీ. అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద 3 పాస్‌పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.