వద్దు వద్దన్నా.. ఆయనకే పగ్గాలు
వద్దు వద్దన్నా.. ఆయనకే పగ్గాలు
Published Sun, Jun 18 2017 11:20 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నామన
- నియమించిన చంద్రబాబు
- మెజార్టీ నోరు నొక్కి ఏకపక్ష నిర్ణయం
- జెడ్పీ పీఠం నుంచి రాంబాబు ఉద్వాసన తప్పదని అనుమానాలు
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎంతో కాలానికి వచ్చిన పదవిని వదులుకోవాలంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అందునా ఏ తప్పూ లేకుండా వైదొలగమంటే మనసుకు మరింత కష్టంగా ఉంటుంది. పైగా ఆ పదవిని తన కళ్లముందే మరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే.. పంచభక్ష్య పరమాన్నాలతో ఉన్న తన విస్తరిని ఎవరో తన్నుకుపోయినంతగా పరివేదన కలుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు సరిగ్గా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వద్దు వద్దన్నా ఆయనకు అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలను అప్పగించారు. మరోపక్క జెడ్‌పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా జెడ్‌పీ చైర్మన్ నామన రాంబాబును నియమితులయ్యారు. తనకు పార్టీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదని, అలాగే, జెడ్‌పీ పీఠాన్ని కూడా వదులుకునేది లేదని ఇప్పటికే నామన కరాఖండీగా చెప్పారు. మెజారిటీ జెడ్‌పీటీసీ సభ్యులు కూడా ఆయనను జెడ్‌పీ చైర్మన్ పదవి నుంచి తొలగించవద్దని కోరారు. అయినప్పటికీ వారి మనోగతాన్ని బేఖాతరు చేస్తూ.. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి నామన పేరునే అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఖరారు చేశారు. తద్వారా.. అసలే తమకు అధికారాలు లేవని మధనపడుతున్న జెడ్‌పీటీసీ సభ్యులకు షాక్ ఇచ్చారు.
ఇష్టం లేదన్నా..
వాస్తవానికి నామనను జెడ్‌పీ పీఠం నుంచి తప్పించి, ఆ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు, జగ్గంపేట జెడ్‌పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు అప్పగించేందుకు పార్టీ నేతలు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు సమక్షంలో గత నెల 21న కాకినాడలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు జెడ్‌పీటీసీ సభ్యులు, పార్టీ నేతలు జెడ్‌పీ చైర్మన్ మార్పును వ్యతిరేకించారు. వివాదరహితుడైన నామన రాంబాబును ఆ పదవి నుంచి తప్పించవద్దని, దీనివల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వారి మనోధైర్యం దెబ్బ తింటుందని మొత్తుకున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పారు. అధికారాలు, నిధులు, విధులు లేకపోతే పోయే.. కనీసం తమకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పనులు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమకు చెందిన నామన సహితం జెడ్‌పీ పీఠాన్ని విడిచిపెట్టేందుకు, పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఒత్తిడి తేవడంతో అలకబూనిన నామనను.. ప్రత్తిపాడులో నిర్వహించిన మినీ మహానాడు వేదిక పైకి తీసుకువచ్చి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. అయితే, అవి బెడిసికొట్టాయి.
అప్పటినుంచీ ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాన్చుతూ వచ్చారు. తన వ్యూహంలో భాగంగా పక్షం రోజులుగా జెడ్‌పీటీసీ సభ్యులను విభజించి పాలించే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఎమ్మెల్యేల ద్వారా నయానా భయానా వారి నోరు నొక్కి దారికి తెచ్చుకున్నారు. తద్వారా చివరకు నామనకు నామం పెట్టే దిశగా చర్యలు ఆరంభించారు. ఇందులో భాగంగానే ఆయనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక జెడ్‌పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనకు ఉద్వాసన పలకడం కూడా ఖాయమని పలువురు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసేవారు కరివేపాకుల్లా తీసి పారేస్తారన్న విషయాన్ని అధిష్టానం మరోసారి రుజువు చేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జెడ్‌పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్‌పీ సర్వసభ్య సమావేశంలో సహితం తమకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారని, చివరకు చైర్మన్‌ను మార్చాలన్నా వారి పెత్తనమే చెల్లుబాటవుతోందని టీడీపీ జెడ్‌పీటీసీ సభ్యులు రగిలిపోతున్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆత్మాభిమానం చంపుకుని అనివార్యంగా కట్టుబడి ఉండాల్సి వచ్చిందని వారంటున్నారు. కానీ ఈ అర్ధాంతరపు ఉద్వాసన ప్రక్రియ మాత్రం పార్టీకి తీవ్ర నష్టమే తెస్తుందని స్పష్టం చేస్తున్నారు. నామనకు జెడ్‌పీటీసీ సభ్యులు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో మూడేళ్లు వచ్చే జూలై 5 నాటికి పూర్తి కానున్నాయి. అప్పటివరకైనా ఆయనను ఆ పీఠంపై ఉంచుతారా లేక ఈలోపే ఉద్వాసన పలుకుతారా అనేది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement