Namana
-
వద్దు వద్దన్నా.. ఆయనకే పగ్గాలు
- టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నామన - నియమించిన చంద్రబాబు - మెజార్టీ నోరు నొక్కి ఏకపక్ష నిర్ణయం - జెడ్పీ పీఠం నుంచి రాంబాబు ఉద్వాసన తప్పదని అనుమానాలు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎంతో కాలానికి వచ్చిన పదవిని వదులుకోవాలంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అందునా ఏ తప్పూ లేకుండా వైదొలగమంటే మనసుకు మరింత కష్టంగా ఉంటుంది. పైగా ఆ పదవిని తన కళ్లముందే మరొకరికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే.. పంచభక్ష్య పరమాన్నాలతో ఉన్న తన విస్తరిని ఎవరో తన్నుకుపోయినంతగా పరివేదన కలుగుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు సరిగ్గా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వద్దు వద్దన్నా ఆయనకు అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలను అప్పగించారు. మరోపక్క జెడ్పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును నియమితులయ్యారు. తనకు పార్టీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేదని, అలాగే, జెడ్పీ పీఠాన్ని కూడా వదులుకునేది లేదని ఇప్పటికే నామన కరాఖండీగా చెప్పారు. మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు కూడా ఆయనను జెడ్పీ చైర్మన్ పదవి నుంచి తొలగించవద్దని కోరారు. అయినప్పటికీ వారి మనోగతాన్ని బేఖాతరు చేస్తూ.. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి నామన పేరునే అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఖరారు చేశారు. తద్వారా.. అసలే తమకు అధికారాలు లేవని మధనపడుతున్న జెడ్పీటీసీ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఇష్టం లేదన్నా.. వాస్తవానికి నామనను జెడ్పీ పీఠం నుంచి తప్పించి, ఆ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు, జగ్గంపేట జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల నవీన్‌కు అప్పగించేందుకు పార్టీ నేతలు చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు సమక్షంలో గత నెల 21న కాకినాడలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్ మార్పును వ్యతిరేకించారు. వివాదరహితుడైన నామన రాంబాబును ఆ పదవి నుంచి తప్పించవద్దని, దీనివల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వారి మనోధైర్యం దెబ్బ తింటుందని మొత్తుకున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తప్పని చెప్పారు. అధికారాలు, నిధులు, విధులు లేకపోతే పోయే.. కనీసం తమకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పనులు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమకు చెందిన నామన సహితం జెడ్పీ పీఠాన్ని విడిచిపెట్టేందుకు, పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఒత్తిడి తేవడంతో అలకబూనిన నామనను.. ప్రత్తిపాడులో నిర్వహించిన మినీ మహానాడు వేదిక పైకి తీసుకువచ్చి, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల సహా పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. అయితే, అవి బెడిసికొట్టాయి. అప్పటినుంచీ ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాన్చుతూ వచ్చారు. తన వ్యూహంలో భాగంగా పక్షం రోజులుగా జెడ్పీటీసీ సభ్యులను విభజించి పాలించే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఎమ్మెల్యేల ద్వారా నయానా భయానా వారి నోరు నొక్కి దారికి తెచ్చుకున్నారు. తద్వారా చివరకు నామనకు నామం పెట్టే దిశగా చర్యలు ఆరంభించారు. ఇందులో భాగంగానే ఆయనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక జెడ్పీ చైర్మన్ పీఠం నుంచి ఆయనకు ఉద్వాసన పలకడం కూడా ఖాయమని పలువురు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేసేవారు కరివేపాకుల్లా తీసి పారేస్తారన్న విషయాన్ని అధిష్టానం మరోసారి రుజువు చేసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సహితం తమకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేస్తున్నారని, చివరకు చైర్మన్‌ను మార్చాలన్నా వారి పెత్తనమే చెల్లుబాటవుతోందని టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు రగిలిపోతున్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆత్మాభిమానం చంపుకుని అనివార్యంగా కట్టుబడి ఉండాల్సి వచ్చిందని వారంటున్నారు. కానీ ఈ అర్ధాంతరపు ఉద్వాసన ప్రక్రియ మాత్రం పార్టీకి తీవ్ర నష్టమే తెస్తుందని స్పష్టం చేస్తున్నారు. నామనకు జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో మూడేళ్లు వచ్చే జూలై 5 నాటికి పూర్తి కానున్నాయి. అప్పటివరకైనా ఆయనను ఆ పీఠంపై ఉంచుతారా లేక ఈలోపే ఉద్వాసన పలుకుతారా అనేది వేచి చూడాల్సిందే. -
వీడని జెడ్పీట ముడి
- చేతులెత్తేసిన ‘దేశం’ - చతికిలపడ్డ నేతలు - పార్టీ జిల్లా పగ్గాలపై వెనకడుగు - భంగపడిన పార్టీ పెద్దలు - నిరాశలో జ్యోతుల వర్గం, . సాక్షి ప్రతినిధి, కాకినాడ : క్రమశిక్షణ ... ఓ పద్ధతి ప్రకారం నడిచే పార్టీ ... మాట మీద నిలబడే కార్యకర్తల శ్రేణి తమకే సొంతమనే టీ డీపీలో క్రమ ‘శిక్ష’ గానే మారుతోంది. తాజాగా పార్టీ జిల్లా పగ్గాలను కార్యకర్తల సమక్షంలో ప్రకటించినప్పటికీ అప్పగించలేక చేతెలెత్తేసి చతికిలపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెంది దాదాపు 14 నెలలైంది. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న ఆ పోస్టును కోనసీమకు చెందిన జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుకు అప్పగించేందుకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించడం తెలిసిందే. జిల్లా పగ్గాలు అప్పగించి చైర్మన్ పీఠం వదులుకోమంటే ససేమిరా అంటూ చైర్మన్ నామన రాంబాబు ధిక్కార స్వరం వినిపించారు. వాస్తవానికి మంగళవారం ప్రత్తిపాడులో జరిగిన పార్టీ మినీ మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడిగా రాంబాబును ప్రకటించాలి. కానీ మనస్తాపంతో అలక వహించిన నామన ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా అన్న మాట ప్రకారమే మినీ మహానాడుకు రాకుండా జెడ్పీ బంగ్లాకే పరిమితమయ్యారు. . కాళ్లా వేళ్లా పడి... ఆయన మినీ మహానాడుకు రాకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డునపడ్డాయంటూ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి అధిష్టానం నుంచి అక్షింతలు పడతాయనే భయం నేతలను వెంటాడింది. జిల్లా టీడీపీలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ బయటపెట్టిన విషయం పాఠకులకు విదితమే. వరుస కథనాల్లో బయటపడిన లుకలుకలు మాదిరిగానే అగ్రనేతలు కూడా పార్టీ పగ్గాల విషయంలో ఎటూ తేల్చుకోలేక తలలుపట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వర్మను నామన వద్దకు రాయబారానికి పంపించగా సుమారు గంటపాటు సమాలోచనలు జరిగాయి. పార్టీ జిల్లా పగ్గాలను జెడ్పీ చైర్మన్‌కు అప్పగించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే స్వీయ నిర్ణయం తీసుకున్నారని, అందులో మెజార్టీ అభిప్రాయం లేదని పలువురు నేతలు నామన దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. . మౌన ముద్రలోనే నామన... చివరకు నామన మినీ మహానాడుకు రావడం వరకు ఒప్పించగలిగారుగానీ వేదికపైకి వచ్చిన దగ్గర నుంచి వేదిక దిగిపోయే వరకు నామన మౌనముద్రలోనే గడిపారు. వేదికపై ఉన్న ఎవరితోను కనీస పలకరింపు కూడా లేకుండా ముభావంగా కనిపించారు. జెడ్పీ చైర్మన్ మాట ఎలా ఉన్నా పార్టీ జిల్లా పగ్గాలు మినీ మహానాడు వేదికగా ప్రకటించాలనుకున్న చినరాజప్ప, కళావెంకట్రావు వంటి అగ్రనేతలకు భంగపాటు తప్పలేదు. . జిల్లా అధ్యక్ష బాధ్యతలు వాయిదా... మినీ మహానాడుకు నామనను తీసుకు రావడంతో కొంతవరకు పరువు దక్కిందనుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. నామన అలకబూనడం, పార్టీ జెడ్పీటీసీలు చైర్మన్ పీఠం మార్చవద్దని, అలా మారిస్తే రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు వెనక్కు తగ్గక తప్పింది కాదు. మినీ మహానాడు వేదికపై తమ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరంటూ మంత్రి యనమల గొప్పలకు పోతూనే జెడ్పీ చైర్మన్ మార్పు, పార్టీ జిల్లా పగ్గాలు వ్యవహారంలో అసమ్మతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీ అంతర్గత విషయాల్లో రోడ్డెక్క వద్దని నేతలకు సూక్తులు వినిపించారు. కానీ మినీ మహానాడు వేదికపై ప్రకటించాల్సిన పార్టీ జిల్లా పగ్గాలు విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. యనమల ప్రసంగాన్ని ముగించి భోజన విరామ సమయంలో నామనను వేదికకు దిగువన ఒకపక్కకు తీసుకువెళ్లి పార్టీ పగ్గాలపై ఒప్పించేందుకు యనమల చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో పార్టీ నేతలంతా కుదేలయ్యారు. ఇక చేసేదేమీ లేక పార్టీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంపై ఒకరకంగా ‘స్టే’ విధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ ఎదురుకాని పరిస్థితి పార్టీలో తలెత్తడంతో పార్టీ అగ్రనేతలు ఎటూ నిర్ణయం తీసుకోలేక తలలుపట్టుకుంటున్నారు. . పాపం జ్యోతుల... మరోపక్క పార్టీ జిల్లా పగ్గాలు నామనకు అప్పగించేలా ఒప్పించే ప్రక్రియ పూర్తయితే జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో స్పష్టత వస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం ఎదురుచూసింది. ఆ దిశగా కొందరు అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం ఆ వర్గానికి నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం అనవసర రాద్ధాంతం ఉండకూడదని పార్టీ పగ్గాలు వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి నిర్ణయం అక్కడే జరిగేలా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంమీద పార్టీ ముఖ్యనేతలంతా ఉండి కూడా జిల్లా స్థాయిలో సమస్యను పరిష్కరించ లేక చేతులెత్తేయడం కేడర్‌కు ఏమాత్రం రుచించడం లేదు. -
ప్రధాని మోదీని కదిలించిన విద్యార్థిని లేఖ
చిక్మంగళూరు: బహుశా ఆ బాలిక లేఖ రాసినప్పుడు కూడా అంతగా ఊహించి ఉండకపోవచ్చు. ప్రధానికి లేఖ అంది తన గ్రామానికి మంచి జరుగుతుందని, వారి కష్టాలు తీరుతాయని అస్సలు అనుకొని ఉండకపోవచ్చు. కానీ, ఆమె కల నెరవేరుతోంది. కళ్లముందే వారికున్న ఒక్కోసమస్య మాయమవుతోంది. గత సోమవారం నుంచి ఆ బాలిక ఊరికి అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వ పెద్దలు వరుస కట్టారు. లేఖ రాసిన ఆ బాలికపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆ గ్రామాన్ని వృద్ధిలోకి తెచ్చే చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే అది కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలోగల ముదిగర్ తాలుకాలోని అలేఖాన్ హోరట్టి అనే చిన్న గ్రామం. ఆ ఊరికి కనీస సౌకర్యాలు కూడా లేవు. మొత్తం 35 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 300 మంది ఉంటున్నారు. వారికి కనీసం ఓ మోటారు వాహనం పోయేందుకు అనుకూలమైన రోడ్డు కూడా లేదు. అదే గ్రామంలో నమన (16) అనే బాలిక ఉంది. బిద్దర్ హళ్లిలోని మోరార్జీ దేశాయ్ రెసిడెంట్ పాఠశాలలో చదువుతోంది. తమ గ్రామాన్ని చూసి ప్రతి రోజు బాధపడే ఆ అమ్మాయి ఒక రోజు ప్రధాని నరేంద్రమోదీకి పూర్తి వివరాలతో లేఖ రాయాలనుకుంది. ఈ విషయాన్ని తన గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆమెను ప్రోత్సహించారు. అనుకున్న ప్రకారం అక్టోబర్ 6న లేఖ ప్రధానికి రాసింది. అయితే, రెండు నెలలు అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ అమ్మాయి ఆశ వదులుకుంది. అయితే, ఆ బాలికకు పీఎంవో స్పందించి ఆ గ్రామ సమస్యలు తీర్చాలని చిక్ మంగళూరు పరిపాలన విభాగాన్ని ఆదేశించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. ప్రస్తుతం జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు క్యూకట్టారు. ఆ బాలికపై అభినందనలు కురిపించి గ్రామాభివృద్ది పనులు ప్రారంభించారు. దాదాపు పది కోట్లతో ఆ గ్రామాభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. ఇంకా మరిన్ని నిధులు రానున్నాయి.