ప్రధాని మోదీని కదిలించిన విద్యార్థిని లేఖ
చిక్‌మంగళూరు: బహుశా ఆ బాలిక లేఖ రాసినప్పుడు కూడా అంతగా ఊహించి ఉండకపోవచ్చు. ప్రధానికి లేఖ అంది తన గ్రామానికి మంచి జరుగుతుందని, వారి కష్టాలు తీరుతాయని అస్సలు అనుకొని ఉండకపోవచ్చు. కానీ, ఆమె కల నెరవేరుతోంది. కళ్లముందే వారికున్న ఒక్కోసమస్య మాయమవుతోంది. గత సోమవారం నుంచి ఆ బాలిక ఊరికి అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వ పెద్దలు వరుస కట్టారు. లేఖ రాసిన ఆ బాలికపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆ గ్రామాన్ని వృద్ధిలోకి తెచ్చే చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే అది కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లాలోగల ముదిగర్ తాలుకాలోని అలేఖాన్ హోరట్టి అనే చిన్న గ్రామం.
ఆ ఊరికి కనీస సౌకర్యాలు కూడా లేవు. మొత్తం 35 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 300 మంది ఉంటున్నారు. వారికి కనీసం ఓ మోటారు వాహనం పోయేందుకు అనుకూలమైన రోడ్డు కూడా లేదు. అదే గ్రామంలో నమన (16) అనే బాలిక ఉంది. బిద్దర్ హళ్లిలోని మోరార్జీ దేశాయ్ రెసిడెంట్ పాఠశాలలో చదువుతోంది. తమ గ్రామాన్ని చూసి ప్రతి రోజు బాధపడే ఆ అమ్మాయి ఒక రోజు ప్రధాని నరేంద్రమోదీకి పూర్తి వివరాలతో లేఖ రాయాలనుకుంది. ఈ విషయాన్ని తన గ్రామస్తులకు, ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆమెను ప్రోత్సహించారు. అనుకున్న ప్రకారం అక్టోబర్ 6న లేఖ ప్రధానికి రాసింది.
అయితే, రెండు నెలలు అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ అమ్మాయి ఆశ వదులుకుంది. అయితే, ఆ బాలికకు పీఎంవో స్పందించి ఆ గ్రామ సమస్యలు తీర్చాలని చిక్ మంగళూరు పరిపాలన విభాగాన్ని ఆదేశించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. ప్రస్తుతం జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి అధికారులు, ప్రభుత్వ పెద్దలు క్యూకట్టారు. ఆ బాలికపై అభినందనలు కురిపించి గ్రామాభివృద్ది పనులు ప్రారంభించారు. దాదాపు పది కోట్లతో ఆ గ్రామాభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. ఇంకా మరిన్ని నిధులు రానున్నాయి.