18 నుంచి నంది నాటకోత్సవాలు
18 నుంచి నంది నాటకోత్సవాలు
Published Tue, Jan 10 2017 10:39 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
- విజయవంతానికి ఆర్డీఓ రఘుబాబు పిలుపు
- ఉత్సవ సమన్వయ కమిటీల ఏర్పాటు
కర్నూలు సీక్యాంప్: ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆర్డీఓ రఘుబాబు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న కళాకారులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ కోసం మంగళవారం ఆయన తన కార్యాలయంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి కళాకారులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో 25పద్యనాటకాలు, 11సాంఘిక నాటకాలు, 27సామాజిక నాటకాలు, 9చిన్నపిల్లల నాటకాలు, 4కళాశాల, వర్సిటీ నాటకాలు మొత్తం 76 ప్రదర్శనలుంటాయన్నారు. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ డీడీకి విన్నవించామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖాధికారులను కోరామన్నారు. రాష్ట్రంలో విజయనగరం, గుంటూరు, కర్నూలు జిల్లాలో నందినాటకోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్.డీ.సి మేనేజర్ శ్రీనివాసులు, సమాచార శాఖ డీడీ శామ్యూల్‌సుకుమార్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పోలీస్, మెడికల్ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement