కర్నూలులో నంది నాటకోత్సవాలు
కర్నూలులో నంది నాటకోత్సవాలు
Published Sat, Nov 26 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
– జనవరి 18 నుండి ప్రారంభం
కర్నూలు(కల్చరల్): నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కర్నూలులో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎస్‌ఎఫ్‌డీసీ) జనరల్ మేనేజర్ శేషసాయి తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలిపారు. జనవరి 18, 2017 నుండి రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి కర్నూలు, గుంటూరు ప్రాంతాలను నిర్ణయించామని, మరొక ప్రాంతాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. 2017 జనవరి 18 నుండి కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో పద్యనాటకం, సాంఘిక నాటకం, బాలల నాటకం, యువజన నాటకాలలో పోటీలు ఉంటాయన్నారు. పద్య నాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు.. బాలల, యువజన నాటకాలకు రూ.15 వేల పారితోషికాన్ని అందిస్తామన్నారు. నంది నాటక పోటీలలో పాల్గొనదలచిన నాటక సమాజాలు డిసెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్క్రూటినీ కమిటీ ఎంపిక చేసిన నాటకాలనే నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించేవారన్నారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఒకసారి ప్రదర్శన చేసిన ఏ నాటకాన్నైనా నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించవచ్చన్నారు. యువజన నాటక పోటీల్లో కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 16–25 ఏళ్ల లోపు వయస్కులై ఉండాలన్నారు. కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించేందుకు కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబును జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారన్నారు. విలేకరుల సమావేశంలో లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, నంద్యాల కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రంగస్థల నటుడు ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, ఎం.ఎస్.ప్రసాద్, సురభి శంకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement