నంద్యాల సీటు ఎవరికిద్దాం!
ముఖ్యనేతలతో చర్చించిన లోకేష్?
– తమ కుటుంబానికే ఇవ్వాలంటున్న భూమా వర్గం
– తమకే ఇవ్వాలంటున్న శిల్పా వర్గం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల అసెంబ్లీ సీటు ఎవ్వరికివ్వాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉప్పు–నిప్పుగా ఉన్న భూమా–శిల్పా వర్గాలు నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ ఇదే తంతును కొనసాగిస్తున్నాయి. అభ్యర్థిత్వం తమదంటే తమదని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
ఈ పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరలో నంద్యాల అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం నంద్యాలలోని ఒక ప్రైవేటు హోటల్‌లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జిల్లాలోని ముఖ్య నేతలతో చర్చించినట్టు సమాచారం. సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనట్టు తెలిసింది. ప్రధానంగా ఈ సీటును తమకే ఇవ్వాలని భూమా కుటుంబీకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేసిన తమకే ఇవ్వాలని శిల్పా వర్గం కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది.
తమకంటే.. తమకని!
నంద్యాల అసెంబ్లీ సీటుకు ఎన్నికలు జరిగితే ఇందులో తమకంటే తమకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఇరువర్గాలు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ తరపున పోటీ చేసింది కూడా శిల్పా మోహన్ రెడ్డి అని.. అందుకే ఆయనకే ఇవ్వాలనే వాదనను శిల్పా వర్గీయులు తెస్తున్నారు. అయితే, ఇందుకు భూమా వర్గం కౌంటర్ ఇస్తోంది. తమ కుటుంబానికి ఇస్తే పోటీ ఉండదని చెబుతోంది. ఇందులో భూమా రెండో కూతురు మౌనికతో పాటు అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డి పేర్లు ప్రతిపాదనకు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిందని కాబట్టి.. తమకే ఇవ్వాలని ఇప్పటికే ఆ పార్టీ వాదన తెరమీదకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కుటుంబానికి సీటు ఇస్తే పోటీ ఉండదనే వాదన సరికాదని శిల్పా వర్గం పేర్కొంటున్నట్టు సమాచారం. ఆ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అవుతుందని.. అప్పుడు వారి తరపున ప్రకటించే అభ్యర్థిపై ఎలాంటి పోటీ లేకుండా అప్పగించాల్సి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
మంత్రి పదవితోనే సరా...!
వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారినప్పటికీ భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఆయన క్షోభతో మరణించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా విమర్శల జడి పెరగకుండా చూసుకోవాలని అధికారపార్టీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని ఫీలర్స్ కూడా వదిలింది. అయితే, ఇక అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తే.. నంద్యాల సీటు ఇవ్వకుండా మేనేజ్ చేయవచ్చుననేది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. దీనిపై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉందని.. ఈ విధంగా కూడా భూమా కుటుంబాన్ని మోసం చేశారన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుందని కూడా అధికార పార్టీ మదనపడుతోంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారం అధికారపార్టీ పెద్దల బుర్రను హీట్ ఎక్కిస్తోంది.