ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు
విజయవాడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో జాతీయ మహిళా పార్లమెంట్ (సదస్సు) ఫిబ్రవరిలో పదో తేదీ నుంచి మూడు రోజులపాటు జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లపై స్థానిక తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమన్వయశాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆధ్వర్యంలో ఎంఐటీ స్కూల్స్ ఆఫ్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. 90 మంది మహిళా ఎంపీలు, మహిళా ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు 400 మంది, పది మంది విధానసభ స్పీకర్లు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన మహిళలు, వివిధ రాష్ట్రాల నుంచి 10 వేల మంది విద్యార్థినులు పాల్గొంటారని వివరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం
డిసెంబర్‌లో నగరంలోని ఇందిరాగాం«ధీ మున్సిపల్ స్టేడియంలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరుగుతుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వేల మంది కూచిపూడి నృత్య కళాకారులు, వారి సహాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తునందున ఆధికారులు సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్, సబ్‌కలెక్టర్ జి.సృ జన, అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో సీహెచ్.రంగయ్య, డీటీసీ మీరాప్రసాద్, డీఈవో సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు, ఐసీడీఎస్ పీడీ కె.కృష్ణకుమారి, పశుసంవర్ధకశాఖ జేడీ డి.దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.