నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేయాలి
– ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, మల్లికార్జున
కల్లూరు (రూరల్): నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేయాలని ఐఎంఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ మల్లికార్జున డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం ఎదుట ఐఎంఏ చేపట్టిన దేశవ్యాప్త సత్యాగ్రహం కార్యక్రమానికి కర్నూలు మెడికల్ రెప్రజెంటేటివ్ అసోసియేషన్ మద్దుతుతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ, మల్లికార్జున మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రపంచంలోనే అతిపెద్దదని, 30 రాష్ట్రాల్లో 1765 బ్రాంచులుండి దేశవ్యాప్తంగా 2,70వేల మంది డాక్టర్ల సభ్యత్వం కలిగి ఉందన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్‌ను రద్దు చేసి ఎంసీఐని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. పీసీ, పీఎన్‌డీటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లను సవరించాలన్నారు. వినియోగదారుల రక్షణ యాక్ట్‌ను సవరించి మృతుల కుటుంబాలకు ఇచ్చే కాంపన్సేషన్‌ను ఆపేయాలన్నారు. షెడ్యూల్డ్ మందులు అల్లోపతి వైద్యులు మాత్రమే రాయాలన్న హక్కులు సరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు బాలమద్దయ్య, రామచంద్రనాయుడు, అల్లారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కుళ్లాయప్ప, రమేష్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.