– వారం రోజులుగా నవ నిర్మాణ దీక్షల్లో జిల్లా యంత్రాంగం
– స్తంభించిన పరిపాలన ... కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు
- డ్వాక్రా మహిళలే ముడిసరుకులు
- మూతపడిన 5,545 అంగన్వాడీ కేంద్రాలు
- వారానికి రెండు రోజుల ఇచ్చే గుడ్లకూ కాళ్లు
- పల్లెల మోహం చూడని 350 గ్రామ కార్యదర్శులు
- ప్రయోజనం లేకున్నా సుమారు రూ. కోటితో దీక్షల హడావుడి
సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షల పేరిటి నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా తనమునకలైంది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ అయిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజులపాటు జరిగిన సంకల్ప దీక్షల పేరుతో చేపట్టిన కార్యక్రమాల వల్ల సాధారణ పరిపాలన పూర్తిగా పడకేసింది. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ దీక్షల్లో పాల్గొనాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కార్యాలయాలకు స్వస్తి చెప్పి దీక్షలు జరిగే సభల వద్ద కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఈ దీక్షలను విజయవంతం చేయాలని, జయప్రదం చేసినవారికి బహుమతులు కూడా ఇస్తామంటూ ప్రకటించింది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వారం రోజులపాటు దీక్షలు నిర్వహించేందుకు రూ.కోటి మంజూరు చేసింది.
ఉన్నతాధికారులంతా దీక్షల్లోనే...
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఈ దీక్షలకు ప్రత్యేక అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాల్సిన బాధ్యతలను వీరికి అప్పగించింది. అలాగే జిల్లాలోని ఏడుగురు ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు, ఆరుగురు డివిజనల్ పంచాయతీ అధికారులు, కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు అందరూ నవనిర్మాణ దీక్షల్లో తీరకలేకుండా గడిపారు. ఇక క్షేత్ర స్థాయి అధికారులు తప్పని సరిగా తరలి రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు జరుగుతున్న ప్రాంగణాల వద్ద ప్రత్యేకంగా హాజరు పట్టీని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి అధికారి వారి పేరు, వివరాలు అందులో నమోదు చేయాల్పి రావడంతో తరువాత ఎందుకీ తలనొప్పంటూ ఇష్టం లేకపోయినా...కష్టంగా ఉన్నా రావల్సి వచ్చింది.
పడకేసిన పరిపాలన...
ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకూ వారం రోజులపాటు దీక్షల్లో పాల్గొనడంతో జిల్లాలో సాధారణ పరిపాలన పడకేసింది. ఆయా కార్యాలయాల్లో ప్రతి రోజూ సగానికిపైగా అధికారులు, సిబ్బంది షిప్టులు వారీగా దీక్షలకు హాజరుకావడంతో వివిధ రకాల పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది. మీసేవా నుంచి దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్నాయి. జిల్లాలోని 350 మంది పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొనడంతో మరణ, జనన, నివాస ధృవ పత్రాలు జారీ నిలిచిపోయింది.
వారం రోజులుగా కార్యదర్శులు గ్రామాల వైపు చూసే సమయం కూడా లేకపోయింది. ఫలితంగా గ్రామ పాలన పడకేసింది. + పర్యవేక్షణ అధికారులు లేక ఉపాధి హామీ పనులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టాల్సిన పనులు ఆపేశారు.
గత సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో మినహా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా వాణి తూతూ మంత్రంగా జరిగింది.
రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా కింది స్థాయి సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
సభలకు డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీలు...
నవ నిర్మాణ దీక్షల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అధికారులు డ్వాక్రా మహిళలను దీక్షలకు తీసుకురావాలని కమ్యూనిటీ ఆర్గనైజర్స్, రిసోర్స్ పర్సన్లకు ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సమావేశం ఉందంటూ తప్పక రావాలని సీవోలు, ఆర్పీలు డ్వాక్రా సంఘాలకు సమచారం పంపారు. విడతల వారీగా ప్రతి రోజూ కొంతమంది చొప్పున దీక్షలకు డ్వాక్రా మహిళలను తరలించారు. ఇక నవ నిర్మాణ దీక్షలతో వారం రోజులపాటు జిల్లాలోని 5,545 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు దీక్షలకు వెళ్లాల్సి రావడంతో కేంద్రాలు వారం రోజుల పాటు తెరుచుకోలేదు. ప్రతి రోజూ పౌష్టికాహారం, మంగళ, శుక్రవారాల్లో ఇచ్చే గుడ్లకు పిల్లలు దూరమయ్యారు.