కాసులకు కక్కుర్తి.. కడుపుకు కోత
* అవసరం లేకున్నా.. 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ ఆపరేషన్!
* కరీంనగర్ జిల్లాలో రోజుకో చోట
* వెలుగు చూస్తున్న వ్యవహారం
రాయికల్/గొల్లపల్లి: అవసరం లేకున్నా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేస్తున్న ఘటనలు కరీంనగర్ జిల్లాలో రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కథలాపూర్ మండలం గంభీర్‌పూర్, దూలూరు తదితర గ్రామాల్లో విద్యార్థులకు ఇలాంటి ఆపరేషన్లు చేసినట్లు తేలగా.. తాజాగా రాయికల్ మండలం మూటపల్లిలో 50 మందికి, గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలోనూ సుమారు 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేశారు.
పలువురు వైద్యులతో కుమ్మక్కై ఆర్‌ఎంపీలే ఈ దందా సాగించినట్లు ఆరోపణలొస్తున్నాయి. రాయికల్ మండలం మూటపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 34 మందికి ఈ ఏడాది కాలంలో అపెండిసైటిస్ ఆపరేషన్లు అయ్యాయి. కడుపునొప్పి వచ్చిందని చెబితే చాలు.. గ్రామంలోని ఆర్‌ఎంపీ జగిత్యాలకు తీసుకుని పోయి ఆపరేషన్ చేయిస్తున్నారు. ఇలాంటి కేసులకు రూ. 20 వేలు బిల్లు తీసుకుని ఆపరేషన్ చేసిన వైద్యులు 40 శాతం, ఆర్‌ఎంపీలకు 60 శాతం సొమ్ము పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అనవసరపు ఆపరేషన్ల వ్యవహారంపై రాయికల్ తహసీల్దార్ చంద్రప్రకాశ్ గురువారం గ్రామంలో విచారించి, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
గొల్లపల్లి మండలం యశ్వంతరావుపేటలో 45 మంది విద్యార్థులకు అపెండిసైటిస్, 10 మంది మహిళలకు గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు చేసినట్లు సమాచారం. అపెండిసైటిస్ బాధితుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే. వీరికి సైతం జగిత్యాలలోని ఆస్పత్రిలోనే ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారు లు విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.