దాతలే దిక్కు | need help | Sakshi
Sakshi News home page

దాతలే దిక్కు

Published Sun, Jul 24 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మంచం పట్టిన లక్ష్మీనారాయణ

మంచం పట్టిన లక్ష్మీనారాయణ

 కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న యువకుడు
 చికిత్స కోసం పాట్లు పడుతున్న తల్లిదండ్రులు
► దాతలు ఆదుకుంటే బతుకుతాడని విన్నపం
 
ఎదిగి వచ్చిన కొడుకు మంచం దిగడానికి అవస్థ పడుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు అవిసిపోతున్నాయి. మలిసంధ్యలో దారి చూపిస్తాడనుకున్న వారసుడు రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకుతుంటే ఆ దంపతుల కళ్లు జీవనదులే అవుతున్నాయి. కిడ్నీ వ్యాధి బారిన పడిన కొడుకుకు తన మూత్రపిండం దానం చేసి ఆ తల్లి కొంగుతో కన్నీరు తుడుచుకునేలోగానే మళ్లీ ఆ మహమ్మారి దాడి చేయడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. చికిత్స కోసం కరిగిపోయిన ఆస్తులు, వైద్యం కోసం పెరిగిపోతున్న అప్పుల కన్నా రోజురోజుకూ శుష్కించిపోతున్న కొడుకు శరీరం ఆ తల్లిదండ్రులను ఊపిరి సలపనివ్వడం లేదు. ఆ..వేదనకు అక్షర రూపమిది. 
– రాజాం
 
జి.సిగడాం మండలం యందువ పంచాయతీ నరశింహాపురానికి చెందిన అల్లు రమణ, సింహాద్రమ్మ దంపతులకు లక్ష్మీనారాయణ, కవిలిలు ఇద్దరు కుమారులు. వీరికి ఆ గ్రామంలో ఇంటితో పాటు 30 సెంట్ల మెట్టు భూమి ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. లక్ష్మీనారాయణ 2009లో పొందూరులోని ఓ ప్రైవేటు ఐటీఐలో ఫిట్టర్‌ ట్రేడ్‌ చదువుతున్నప్పుడు పచ్చ కామెర్లు సోకిందని ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ వ్యాధి అని తెలిసింది. విశాఖ సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చేరగా వెంటనే కిడ్నీ మార్చుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లి సింహాద్రమ్మ తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసుకుని మందులు వాడారు. కానీ మరోసారి కిడ్నీ మహమ్మారి లక్ష్మీనారాయణపై దాడి చేసింది. మొదట ఆపరేషన్‌ జరిగిన ఆరేళ్ల తర్వాత మరోమారు కిడ్నీ పాడైపోయింది. దీంతో లక్ష్మీనారాయణ మంచానికి పరిమితమైపోయాడు. మొదటి ఆపరేషన్‌ జరిగినప్పుడే ఈ కుటుంబం అప్పులపాలైపోయి విశాఖ వలస వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి రావడంతో ఏం చేయాలో వీరికి పాలుపోవడం లేదు. 
 
కిడ్నీ దాతను వెతుక్కుంటే ఆపరేషన్‌ చేస్తామని, సుమారు రూ. 12లక్షలు చెల్లిస్తే జీవన్‌ధాన్‌ సంస్థ ద్వారా తామే కిడ్నీ వెతికి అమరుస్తామని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఇటు కిడ్నీ దొరక్క, అటు ఆపరేషన్‌కు ఆర్థిక స్థోమత చాలక తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. మంచం పట్టిన లక్ష్మీనారాయణ రోజులు లెక్కపెడుతుండడంతో ఎవరైనా దాతలు సాయం చేస్తే తమ కొడుకు బతుకుతాడని కోరుతున్నారు. ఆస్పత్రి ఖర్చులతో సర్వం కోల్పోయి బంధువుల సాయంతో బతుకుతున్నామని, చికిత్స చేయించే స్థోమత లేని తమకు కాసింత చేయూత ఇవ్వాలని అర్థిస్తున్నారు. తమ వివరాలకు ‘సా„ì ’కి చెబుతూ తమకు జి.సిగడాం మండలం బాతువ ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందని, వీలైతే ఆ నంబర్‌ 32900624554లో జమ చేయాలని, లేకుంటే నేరుగా కలవాలంటే ఫోన్‌ నంబర్లు 9000452749, 9502212362కు సంప్రదించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement