ఆనంద్‌ సినీ కాంప్లెక్స్‌లో నీలి షికారీల దౌర్జన్యం | neeli shikaris assault at anand cine comples | Sakshi
Sakshi News home page

ఆనంద్‌ సినీ కాంప్లెక్స్‌లో నీలి షికారీల దౌర్జన్యం

Published Sun, May 28 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

neeli shikaris assault at anand cine comples

- ప్రేక్షకుడి వద్ద డబ్బులు లాక్కొని కత్తులతో దాడి
– పది మందిపై హత్యాయత్నం కేసు నమోదు
కర్నూలు: ఆనంద్‌ కాంప్లెక్స్‌లో నీలిషికారీల ఆగడాలు మితిమీరిపోయాయి. సినిమా టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటూ కొన్ని కుటుంబాలు కొన్నేళ్లుగా జీవనం సాగించేవి. అయితే, కాంప్లెక్స్‌లోని థియేటర్లను ఆధునికీకరించి ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుకునే విధానం అమలు చేయడంతో నీలి షికారీలకు బ్లాక్‌ టికెట్ల విక్రయం ఇబ్బందిగా మారింది. సినిమాలకు వెళ్లే వారు ఆన్‌లైన్, పే టీఎంలో బుక్‌ చేసుకొని కౌంటర్‌ దగ్గర డబ్బులు చెల్లించే విధానం కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఈ విధానం అమలుతో వారి ఆదాయానికి గండి పడుతుందని ప్రతి రోజూ మహిళలు బుకింగ్‌ కౌంటర్‌ దగ్గర నిర్వాహకులతో గొడవలు సృష్టిస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు నెల రోజులుగా క్యూఆర్‌టీ వాహనం ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటున్నప్పటికీ ఏదో రూపంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
 
కర్నూలు పట్టణానికి చెందిన హరీష్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం ఉదయం బాహుబలి-2 సినిమాకు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. డబ్బులు చెల్లించేందుకు బుకింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లడంతో అప్పటికే కొంతమంది నీలి షికారి మహిళలు క్యాష్‌ విషయంలో గొడవ పడుతున్నారు. సైడు ఇవ్వండి టికెట్‌ కొనుగోలు చేయాలంటూ హరీష్‌కుమార్‌గౌడ్‌ నీలిషికారీలకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకుండా అతనిపై దాడి చేశారు. చొక్కా చించి అతని జేబులో ఉన్న రూ.2వేల నగదు లాక్కోవడంతో పాటు అతడిని వెంటాడి కత్తులతో బెదిరించి దాడి చేశారు. బాధితుడు ఈ మేరకు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బంగారు పేటలో నివాసం ఉంటున్న నీలి షికారీలు చిరంజీవి, లక్ష్మి, శివాని, దిల్సర్‌ఖాన్, అతని భార్య, తలారి కూతురు, ఈరమ్మ కోడలు, మనువరాలు, కుమారి, నిహారికతో పాటు మరికొంతమందిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు అయింది. హరీష్‌కుమార్‌ గౌడ్‌ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీలి షికారీలపై ఐపీసీ 341, 307, 384 సెక‌్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు రెండో పట్టణ సీఐ డేగల ప్రభాకర్‌ తెలిపారు. 
 

Advertisement

పోల్

Advertisement