నీరు–చెట్టు గుట్టురట్టు | Neeru Chettu nexus | Sakshi
Sakshi News home page

నీరు–చెట్టు గుట్టురట్టు

Published Wed, Sep 7 2016 1:13 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

నీరు–చెట్టు గుట్టురట్టు - Sakshi

నీరు–చెట్టు గుట్టురట్టు

 
  •  తమ్ముళ్ల మధ్య అసమ్మతి సెగ
  • బిక్కుబిక్కుమంటున్న అధికారులు
  • తొక్కిపెట్టేందుకు నాయకుల ప్రయత్నాలు 
 
ఇరిగేషన్‌శాఖలో నీరు – చెట్టు, ఓఅండ్‌ఎం, ఎఫ్‌డీఆర్, సీఈ మంజూరు చేసిన పనుల్లో జిల్లావ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవూరు నియోజకవర్గంలో పనులు చేయకుండా, అసలు అర్హతలు లేకుండానే చక్రం తిప్పిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలపై సాక్ష్యాలతో సహా ప్రజల్లోకి వెళ్లడంతో అటు అధికారుల్లో, ఇటు నాయకుల్లో గుబులు తారాస్థాయికి చేరుకుంది.
 
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కోవూరు నియోజకవర్గంలో మలిదేవి డ్రెయిన్, విడవలూరు, కొడవలూరు పనులకు సంబంధించిన అవినీతిపై ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. అర్హతలు లేకున్నా ఆయకట్టు కమిటీ చైర్మన్‌గా నియమించి వివిధ పనులకు అగ్రిమెంట్లు చేయించడం వెనుక రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌శాఖ అధికారుల పాత్ర ఉందని తేటతెల్లమైంది. అందుకు ఆ ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో ఇంతవరకు మిన్నకుండిపోయిన రైతులు ఆయన అనుచరుల అవినీతి తీగను లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 
పనులు చేయకుండానే బిల్లులు
మొదటి విడత నీరు–చెట్టు నుంచే బినామీ పేర్లతోనూ, సొంతగా పనులు చేసి కోట్ల రూపాయలు స్వాహా చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకున్నారు. పనుల నాణ్యత పక్కనబెట్టి అసలు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్న చిట్టాను వెలుపల పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఎన్నడూ లేని«§విýlంగా పనుల పరిశీలనకు వెళ్లామని కార్యాలయంలో చెప్పి మరీ పనులకు గైర్హాజరవడం రైతులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు ఇరిగేషన్‌ కార్యాలయాల్లో సిబ్బంది నోరు మెదపడానికి ఇష్టపడడం లేదు. కోవూరు నియోజకవర్గంలో మొదటి విడత నీరు – చెట్టులో రూ.300 కోట్లతో 110 పనులు, రెండో విడతలో రూ.420 కోట్లతో 97 పనులు జరిగినట్లు అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. ఇరిగేషన్‌శాఖకు 30 శాతం, క్వాలిటీ కంట్రోల్‌కు 10 శాతం కమిషన్ల పర్సంటేజ్‌లు పోగా మిగిలిన 60 శాతంలో సగానికిపైగా స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుచరులు సీహెచ్‌ కృష్ణచైతన్య, కె.అమరేంద్రనాథ్‌రెడ్డి, హరికృష్ణ, కె.హరనాథ్‌లు ప్రతి పనిలో భారీగా చేతివాటాలు చూపారని రైతులు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఇటీవల పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈకి సైతం భారీ స్థాయిలో ముడుపులు చెల్లించారని రైతులు చెబుతున్నారు. అందువల్లే ఆ నివేదిక ఇంతవరకు అధికారులకు అందలేదంటున్నారు. 
మూడవ విడతలోనూ.. 
ఒక్క అల్లూరులోనే వందకు పైగా పనులకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలు రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లూరు చెరువు మరమ్మత్తులకు రూ.కోటి, పంట కాలువలకు రూ.50 లక్షలు చొప్పున నాలుగు పనులు, బట్ర కాగొల్లు చెరువుకు రూ.40లక్షలు, నార్త్‌ఆములూరు చెరువుకు రూ.40 లక్షలు, రామన్నపాళెం చెరువు రూ.1.50  కోట్లు, జువ్వలదిన్నె చెరువు రూ.1.50 కోట్లు ప్రతిపాదనలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్బలంతో పంపినట్లు తెలుస్తోంది. కోవూరు–30 పనులు, విడవలూరు–60 పనులు ఇలా జిల్లా మొత్తం మీద ఇచ్చిన నియోజకవర్గాలే మళ్లీమళ్లీ నీరు – చెట్టు పనులను కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం జిల్లావ్యాప్తంగా మరో 1500 పనులకు రూ.300 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 
నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ ఆదేశించినప్పటికీ అవినీతికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టకపోవడం, అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం ఇందుకు ఊతమిస్తోంది. మొత్తం మీద రాజకీయ వ్యవస్థ, అధికారుల పనితీరు మారితే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement