సూచనలు పాటించకుంటే చర్యలు
సూచనలు పాటించకుంటే చర్యలు
Published Fri, Apr 21 2017 9:43 PM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM
– నీరు- చెట్లు సమీక్షలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా
పెద్దాపురం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు–చెట్టు పథకంలో అధికారులు ప్రభుత్వ సూచనలు పాటించకున్నా, వారిపై ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు, ఇరిగేషన్, ఎన్‌ఆర్‌ఇజీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీరు–చెట్టు పథకాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మంజూరైన ప్రతి చెరువు పనులు పంచాయతీ తీర్మానం తరువాతనే మొదలుపెట్టాలని, 25వ తేదీలోగా తీర్మాన పత్రాలను అందజేయాలన్నారు. చెరువుల వద్ద అంచనాలతో కూడిన బ్యానర్లు, పని వివరాల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు సమష్టి కృషి చేయాలన్నారు. డ్వామా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నీరు–చెట్టు పథకంపై పర్యవేక్షణ జరపాలని చెప్పారు. వచ్చే వారంలో అన్ని ప్రాంతాలకు వచ్చి పనులను పరిశీలిస్తానని అన్నారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల వారీగా గంటన్నర పాటు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, కాకినాడ ఆర్డీవోలు వి.విశ్వేశ్వరరావు, బాబూరావు, గణేష్‌కుమార్, రఘుబాబు, ఇరిగేషన్ ఎస్‌ఈ రాంబాబు, జెడ్పీ సీఈఓ పద్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అప్పారావు, ఆయా శాఖల డీఈఈలు, ఏఈలు, ఏపీడీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘చెత్త నుంచి సంపద’ తయారీ కేంద్రం పరిశీలన
కుందాలపల్లి (పి.గన్నవరం) : స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చెత్త నుంచి సంపద’ తయారీ కేంద్రం జిల్లాకు ఆదర్శంగా నిలవడంతో, దీనిని కలెక్టర్ కార్తీకేయ మిశ్రా శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో సేకరించిన చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం, దీని మార్కెటింగ్ తదితర అంశాలను ఆయన ఎంపీడీఓ ఎం.ప్రభాకరరావును అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రం నిర్వాహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. కుందాలపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండటంతో కలెక్టర్ మిశ్రా ఆరా తీశారు. ఈ రోడ్డును జిల్లా పరిషత్ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు బదలాయించామని, రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకుడు పప్పుల గణేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు నరేంద్రపురంలో రూ.32 లక్షలతో చేపట్టిన తాగునీటి చెరువు పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. అమలాపురం ఆర్డీఓ కె.గణేష్ కుమార్, తహసీల్దార్ డి.సునీల్‌బాబు, ఉపాధి హామీ పథకం ఏపీఓ ఎం.రెడ్డిబాబు, పీఎస్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement