–‘పది’ స్పాట్‌లో సగం మంది కూడా లేరు
– ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయని విద్యాశాఖ
– విద్యార్థుల జీవితాలతో చెలగాటం
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో...వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగులు పరిశీలించడం అంతే ముఖ్యం. అయితే స్థానిక కేఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కరువయ్యారు. ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)ను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు మూడువందల మందికి పైచిలుకు స్పెషల్ అసిస్టెంట్లు హాజరుకావాల్సి ఉంది. అయితే 60–70 మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. స్పెషల్ అసిస్టెంట్లను తీసుకోవవడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే.
ఇవీ స్పెషల్ అసిస్టెంట్ల విధులు
అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగులు, మార్కుల టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. పొరబాటున ఏఈలు చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అరకొర రెమ్యూనరేషన్
మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకుగాను రోజుకు సగటున రూ. 550 దాకా వస్తుంది. స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ. 165తో సరిపెడుతున్నారు. డీఏ కూడా లేదు. దీంతో అధికశాతం స్పెషల్ అసిస్టెంట్లగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
రెమ్యూనరేషన్ తక్కువ ఉన్నందున...
రెమ్యూనరేషన్ తక్కువగా ఉందనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంఈఓలకు గట్టిగా చెప్పాం. వీలైనంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- గోవిందునాయక్, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్
స్పెషల్ అసిస్టెంట్లు కరువు!
Published Thu, Apr 6 2017 11:17 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement