tenth spot
-
‘పది’ రెమ్యూనరేషన్ రెట్టింపు చేయాలి
రామడుగు(చొప్పదండి) : ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్సెస్సీ ప్రశ్నాపత్రాల మూల్యాంకనానికి అందజేస్తున్న రెమ్యూనరేషన్ రెట్టింపు చేయాలని పీఆర్టీయూ–టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు తిరుపతిరెడ్డి కోరారు. మండలకేంద్రంలోని ఎమ్మార్సీలో శనివారం జరిగిన పీఆర్టీయూ–టీఎస్ మండలశాఖ కార్యవర్గంలో మాట్లాడారు. ప్రభుత్వం జేసీటీయూ ద్వారా చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఉపాధ్యాయుల 34 సమస్యలను ఏప్రిల్ నెలాఖరు వరకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేలో ఏకీకృత సర్వీస్‌రూల్స్‌పైన ఉన్న స్టేటస్కోను ఎత్తి వేసి బదిలీ, పదోన్నతులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ముజీబ్ అహ్మద్, మండలాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.మల్లారెడ్డి, నాయకులు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సదాశివ్, చోటేమియా, శ్రీనివాస్, సెలెస్టినా, పి.సత్యనారాయణరెడ్డి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
ఆదిలాబాద్‌టౌన్ : పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి ఈనెల 13వరకు జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,314 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. 11 మంది ఏసీఓలను, 1524 మంది ఏఈలను, 259 సీఈలను 520 స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. 24 జిల్లాలకు సంబంధించి 5,64,626 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ అనురాధ తెలిపారు. తెలుగు, ఉర్దూ జవాబు పత్రాలు 90,233, హింది 68,450, ఆంగ్లం 65,196, గణితం 98,794, సామాన్యశాస్త్రం 98,215, సాంఘిక శాస్త్రం 1,43,739 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. డీఈవో క్యాంప్ ఆఫీసర్‌గా, డెప్యూటీ ఈఓ, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మూల్యాంకనం ఉదయం 9 నుంచిమధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు జరగనుంది. రోజుకో ఉపాధ్యాయుడికి 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేసేందుకు ఇవ్వనున్నారు. స్పాట్ బహిష్కరణ వాయిదా.. స్పాట్ బహిష్కరిస్తామని ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం రాత్రి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో స్పాట్ బహిష్కరణ వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. 34 డిమాండ్లతో జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్ గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. చర్చలు జరిపిన డెప్యూటీ సీఎం త్వరలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్పాట్ యథావిధిగా జరగనుంది. కాగా డీటీఎఫ్ సంఘం స్పాట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించింది. -
స్పెషల్ అసిస్టెంట్లు కరువు!
–‘పది’ స్పాట్లో సగం మంది కూడా లేరు – ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయని విద్యాశాఖ – విద్యార్థుల జీవితాలతో చెలగాటం అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో...వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగులు పరిశీలించడం అంతే ముఖ్యం. అయితే స్థానిక కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనంలో స్పెషల్ అసిస్టెంట్లు కరువయ్యారు. ప్రతి ముగ్గురు ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్ (ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు మూడువందల మందికి పైచిలుకు స్పెషల్ అసిస్టెంట్లు హాజరుకావాల్సి ఉంది. అయితే 60–70 మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఉన్నవారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. స్పెషల్ అసిస్టెంట్లను తీసుకోవవడంలో విద్యాశాఖ నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. ఇవీ స్పెషల్ అసిస్టెంట్ల విధులు అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగులు, మార్కుల టోటలింగ్ పరిశీలించాల్సి ఉంటుంది. ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. పొరబాటున ఏఈలు చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అరకొర రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకుగాను రోజుకు సగటున రూ. 550 దాకా వస్తుంది. స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ. 165తో సరిపెడుతున్నారు. డీఏ కూడా లేదు. దీంతో అధికశాతం స్పెషల్ అసిస్టెంట్లగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. రెమ్యూనరేషన్ తక్కువ ఉన్నందున... రెమ్యూనరేషన్ తక్కువగా ఉందనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంఈఓలకు గట్టిగా చెప్పాం. వీలైనంత మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - గోవిందునాయక్, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ఒంటిగంటకే ఖాళీ!
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి మూల్యాంకనం ఎంత బాధ్యతారహితంగా చేస్తున్నారనేందుకు బుధవారం జరిగిన తీరే ప్రత్యక్ష నిదర్శనం. మధ్యాహ్నం ఒంటిగంటకే దాదాపు అన్ని సబ్జెక్టుల అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు కేంద్రాన్ని ఖాళీ చేసేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో...మూల్యాంకం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జవాబుపత్రాలు దిద్దే విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అంతటి ప్రాధాన్యత కల్గిన మూల్యాంకనం విధులను సిబ్బంది గాలికొదిలేశారు. ఇళ్లకు వెళ్లాలనే ఆత్రుతతో ఇష్టారాజ్యంగా దిద్దేసి వెళ్లిపోయారు. 8–3 గంటల వరకు చెప్పిన అధికారులు శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూల్యాంకనం చేసి ఇళ్లకు వెళ్లాలని ముందురోజే క్యాంపు ఆఫీసర్, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్ తెలిపారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు 40 పేపర్లు దిద్దేసి తిరిగి 12 గంటల నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన గేటుకు తాళం వేసినా గోడలు దూకి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి క్యాంపు మొత్తం ఖాళీ అయింది. మిగిలిన జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు నడిచాయి. ఇక్కడి అధికారులు పండుగ దృష్టిలో ఉంచుకుని కాస్త వెసులుబాటు ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం చేయాలి. తొలివిడతగా ఉదయం 20 పేపర్లు, రెండో విడతగా మధ్యాహ్నం 20 పేపర్లు దిద్దాల్సి ఉంది. సమయం ఎక్కువగా ఉండడం వల్ల దిద్దుటలో ఏమాత్రం తప్పులు దొర్లే అవకాశం ఉండదనేని అధికారుల భావన. కొందరు ఏసీఓలు 40 పేపర్లు ఉదయాన్నే ఇస్తుండడంతో వాటిని ఏఈలు మధ్యాహ్నం భోజన సమయానికి దిద్దేసి ఇంటిబాట పడుతున్నారు. కలెక్టర్ దృష్టికి.. బుధవారం జరిగిన ఘటన కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలకే కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైనంపై ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. క్యాంపు పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. -
అడ్డగోలు నియామకాలు
– ‘పది’ మూల్యాంకన సిబ్బంది నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం – విద్యార్థుల జీవితాలతో చెలగాటం – రేపటి నుంచి మూల్యాంకనం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో.. వాటి మూల్యాంకనమూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. జవాబుపత్రాలు దిద్దే సమయంలో ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థులు అన్యాయమవుతారు. జవాబుపత్రాలు దిద్దే విషయంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ)ది కీలక పాత్ర. అలాంటి ఏఈల నియామకాల్లో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు తుంగల్లో తొక్కుతూ ‘అయిన వారికి ఆకుల్లో...కాని వారికి కంచెంలో’ అన్న చందంగా వ్యవహరించింది. వీరి నియామకాల్లో పదో తరగతి బోధనానుభవాన్ని ప్రామాణికంగా తీసుకుకోవాల్సి ఉంది. ఇవి పట్టించుకోని అధికారులు ఇష్టానుసారంగా నియమించారు. ఓవైపు బోధన అనుభవం తక్కువ ఉన్నవారిని నియమిస్తే, మరోవైపు ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టీచర్లను పక్కన పెట్టేశారు. ఈనెల 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. హెచ్ఎంలు ధ్రువీకరించారంటున్న విద్యాశాఖ ఆయా సబ్జెక్టుల్లో బో«ధనానుభవం ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాల్సి ఉంది. వారి ధ్రువీకరణ ఆధారంగానే మూల్యాంకనం విధులకు నియమించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొందరిని యూపీ స్కూళ్లలో పని చేసిన అనుభవాన్ని ›ప్రామాణికంగా తీసుకుని నియమించారు. మరికొందరు కేవలం జెడ్పీహెచ్ఎస్లో పని చేస్తున్నా వారిని విస్మరించారు. తామంతా సక్రమంగా చేశామని, హెచ్ఎంలు ఇచ్చిన వివరాల మేరకు నియమించామని అధికారులు చెబుతున్నారు. – సోదనపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండిట్‌గా పని చేస్తున్న ఎం.ఎర్రిస్వామికి సంబంధించి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని డ్యూటీ వేశారు. – శింగనమల మండలం సలకంచెరువు జెడ్పీహెచ్ఎస్లో హిందీ టీచరుగా పని చేస్తున్న ఫయాజ్‌కు యూపీ స్కూల్ బోధనను పరిగణలోకి తీసుకుని నియమించారు. – హిందూపురం మండలం కె.బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండిట్‌గా పని చేస్తున్న బి.నరసింహమూర్తికి పదోతరగతి బోధించిన అనుభవం 17 ఏళ్ల నాలుగు నెలల 22 రోజులుంది. హెచ్ఎం ధ్రువీకరించారు. అయినా ఈయనను స్పాట్ విధులకు నియమించలేదు. – శింగనమల మండలం పెరవళి జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరుగా పని చేస్తున్న ఎన్. పద్మజ ఏపీపీఎస్సీ ద్వారా 1999లో నియామకమైంది. అప్పటి నుంచి పదో తరగతి బోధిస్తోంది. గతేడాది వరకు స్పాట్ విధులకు నియమించారు. కానీ ఈసారి మాత్రం ఆమెను నియమించలేదు. రాత పూర్వకంగా ఇచ్చినా పట్టించుకోలేదు : మూల్యాంకనం విధులకు జరిగిన నియామకాలు తప్పులతడకగా ఉన్నాయని నాలుగైదు రోజుల కిందే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టిచుకోలేదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు వై. ఆదిశేషయ్య, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు సలీం వాపోయారు. యూపీ స్కూళ్లలో బోధించిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కొందరిని నియమిస్తే, మరికొందరిని కేవలం పదో తరగతి బోధించినా విస్మరించారని వాపోయారు. డీఈఓ, ఏసీ, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్పొప్పులను సరిదిద్దలేదన్నారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు సాగుతోందన్నారు.