అడ్డగోలు నియామకాలు
– ‘పది’ మూల్యాంకన సిబ్బంది నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం
– విద్యార్థుల జీవితాలతో చెలగాటం
– రేపటి నుంచి మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో.. వాటి మూల్యాంకనమూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. జవాబుపత్రాలు దిద్దే సమయంలో ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థులు అన్యాయమవుతారు. జవాబుపత్రాలు దిద్దే విషయంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ)ది కీలక పాత్ర.
అలాంటి ఏఈల నియామకాల్లో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు తుంగల్లో తొక్కుతూ ‘అయిన వారికి ఆకుల్లో...కాని వారికి కంచెంలో’ అన్న చందంగా వ్యవహరించింది. వీరి నియామకాల్లో పదో తరగతి బోధనానుభవాన్ని ప్రామాణికంగా తీసుకుకోవాల్సి ఉంది. ఇవి పట్టించుకోని అధికారులు ఇష్టానుసారంగా నియమించారు. ఓవైపు బోధన అనుభవం తక్కువ ఉన్నవారిని నియమిస్తే, మరోవైపు ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టీచర్లను పక్కన పెట్టేశారు. ఈనెల 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
హెచ్‌ఎంలు ధ్రువీకరించారంటున్న విద్యాశాఖ
ఆయా సబ్జెక్టుల్లో బో«ధనానుభవం ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించాల్సి ఉంది. వారి ధ్రువీకరణ ఆధారంగానే మూల్యాంకనం విధులకు నియమించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొందరిని యూపీ స్కూళ్లలో పని చేసిన అనుభవాన్ని ›ప్రామాణికంగా తీసుకుని నియమించారు. మరికొందరు కేవలం జెడ్పీహెచ్‌ఎస్‌లో పని చేస్తున్నా వారిని విస్మరించారు. తామంతా సక్రమంగా చేశామని, హెచ్‌ఎంలు ఇచ్చిన వివరాల మేరకు నియమించామని అధికారులు చెబుతున్నారు.
– సోదనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండిట్‌గా పని చేస్తున్న ఎం.ఎర్రిస్వామికి సంబంధించి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని డ్యూటీ వేశారు.
– శింగనమల మండలం సలకంచెరువు జెడ్పీహెచ్‌ఎస్‌లో హిందీ టీచరుగా పని చేస్తున్న ఫయాజ్‌కు యూపీ స్కూల్ బోధనను పరిగణలోకి తీసుకుని నియమించారు.
– హిందూపురం మండలం కె.బసవనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండిట్‌గా పని చేస్తున్న బి.నరసింహమూర్తికి పదోతరగతి బోధించిన అనుభవం 17 ఏళ్ల నాలుగు నెలల 22 రోజులుంది. హెచ్‌ఎం ధ్రువీకరించారు. అయినా ఈయనను స్పాట్ విధులకు నియమించలేదు.
– శింగనమల మండలం పెరవళి జెడ్పీహెచ్‌ఎస్‌లో గణితం టీచరుగా పని చేస్తున్న ఎన్. పద్మజ ఏపీపీఎస్సీ ద్వారా 1999లో నియామకమైంది. అప్పటి నుంచి పదో తరగతి బోధిస్తోంది. గతేడాది వరకు స్పాట్ విధులకు నియమించారు. కానీ ఈసారి మాత్రం ఆమెను నియమించలేదు.
రాత పూర్వకంగా ఇచ్చినా పట్టించుకోలేదు :
మూల్యాంకనం విధులకు జరిగిన నియామకాలు తప్పులతడకగా ఉన్నాయని నాలుగైదు రోజుల కిందే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టిచుకోలేదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్‌ఎల్‌టీఏ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షులు వై. ఆదిశేషయ్య, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు సలీం వాపోయారు. యూపీ స్కూళ్లలో బోధించిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కొందరిని నియమిస్తే, మరికొందరిని కేవలం పదో తరగతి బోధించినా విస్మరించారని వాపోయారు. డీఈఓ, ఏసీ, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్పొప్పులను సరిదిద్దలేదన్నారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు సాగుతోందన్నారు.