ఒంటిగంటకే ఖాళీ!
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి మూల్యాంకనం ఎంత బాధ్యతారహితంగా చేస్తున్నారనేందుకు బుధవారం జరిగిన తీరే ప్రత్యక్ష నిదర్శనం. మధ్యాహ్నం ఒంటిగంటకే దాదాపు అన్ని సబ్జెక్టుల అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు కేంద్రాన్ని ఖాళీ చేసేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఎంత ముఖ్యమో...మూల్యాంకం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం పొరబాటు చేసినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జవాబుపత్రాలు దిద్దే విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అంతటి ప్రాధాన్యత కల్గిన మూల్యాంకనం విధులను సిబ్బంది గాలికొదిలేశారు. ఇళ్లకు వెళ్లాలనే ఆత్రుతతో ఇష్టారాజ్యంగా దిద్దేసి వెళ్లిపోయారు.
8–3 గంటల వరకు చెప్పిన అధికారులు
శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మూల్యాంకనం చేసి ఇళ్లకు వెళ్లాలని ముందురోజే క్యాంపు ఆఫీసర్, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్ తెలిపారు. అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు 40 పేపర్లు దిద్దేసి తిరిగి 12 గంటల నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన గేటుకు తాళం వేసినా గోడలు దూకి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి క్యాంపు మొత్తం ఖాళీ అయింది. మిగిలిన జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు నడిచాయి.
ఇక్కడి అధికారులు పండుగ దృష్టిలో ఉంచుకుని కాస్త వెసులుబాటు ఇస్తే దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం చేయాలి. తొలివిడతగా ఉదయం 20 పేపర్లు, రెండో విడతగా మధ్యాహ్నం 20 పేపర్లు దిద్దాల్సి ఉంది. సమయం ఎక్కువగా ఉండడం వల్ల దిద్దుటలో ఏమాత్రం తప్పులు దొర్లే అవకాశం ఉండదనేని అధికారుల భావన. కొందరు ఏసీఓలు 40 పేపర్లు ఉదయాన్నే ఇస్తుండడంతో వాటిని ఏఈలు మధ్యాహ్నం భోజన సమయానికి దిద్దేసి ఇంటిబాట పడుతున్నారు.
కలెక్టర్ దృష్టికి..
బుధవారం జరిగిన ఘటన కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలకే కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైనంపై ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. క్యాంపు పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.