నిండా నిర్లక్ష్యం! | negligance of udies | Sakshi
Sakshi News home page

నిండా నిర్లక్ష్యం!

Published Sun, Aug 6 2017 9:46 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

నిండా నిర్లక్ష్యం! - Sakshi

నిండా నిర్లక్ష్యం!

– ‘యూ డైస్‌’ పని చేయించుకున్నారు..
-  రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా సతాయిస్తున్నారు
– ‘ నిధులు మంజూరు చేయని ఎస్‌ఎస్‌ఏ
–  ఏడాదిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు


అనంతపురం ఎడ్యుకేషన్‌: అవసరానికి వాడుకుని వదిలేయడమంటే ఇదేనేమో. సరిగ్గా ఏడాది కిందట 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం (యూ డైస్‌) వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఉద్యోగులకు నేటికీ రెమ్యూనరేషన్‌ అందలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అసలు కథ ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితర వివరాలను ఏటా యూడైస్‌లో ఆన్‌లైన్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం విద్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. యూడైస్‌కు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. వివరాల నమోదులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చేసినా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది కిందట పని చేయించుకున్న సిబ్బందికి ఇప్పటిదాకా రెమ్యూనరేషన్‌ ఇవ్వలేదు. ఎమ్మార్సీల్లో పని చేస్తున్న  ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు చాలా కష్టపడ్డారు.

రేయంతా కాచుకుని నమోదు
యూడైస్‌ నమోదు సమయంలో రాష్ట్రమంతా ఒకేమారు ఆన్‌లైన్‌ ఓపెన్‌ కావడంతో సర్వర్‌ డౌన్‌ అవుతుంది. దీంతో సిబ్బంది అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకు మేలుకుని వివరాలు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జిల్లాలో 5,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలను గతేడాది యూడైస్‌లో నమోదు చేశారు. ఆన్‌లైన్‌ చేసినందుకు ఒక్కో స్కూల్‌కు రూ.80 కేటాయించారు. ఈలెక్కన మొత్తం రూ.4,09,120 జిల్లాకు రావాల్సి ఉంది.

బడ్జెట్‌ రిలీజ్‌ అయినా..
వాస్తవానికి యూడైస్‌ వివరాలు నమోదు చేసినందుకు ప్రభుత్వం బడ్జెట్‌ కూడా రిలీజ్‌ చేసింది. అయితే ఈ బడ్జెట్‌ను ఇతరవాటికి ఖర్చు చేసినట్లు తెలిసింది. బిల్లు డ్రా చేయకపోవడం వెనుక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఎస్‌ఎస్‌ఏలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల పట్ల కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్‌ అందుబాటులో ఉన్నా..సంబంధిత ఫైలు పెట్టకుండా ఆ ఉద్యోగి చక్రం తిప్పాడు. ఒకానొక సందర్భంలో ఫైలు కనిపించకుండా చేశాడు.  రెమ్యూనరేషన్‌ కోసం ఉద్యోగులు పలుమార్లు అడిగినా...అదిగో ఇదిగో అంటూ అధికారులు దాట వేస్తూ వచ్చారు. అడిగి అడిగి చివరకు వదిలేశామని కొందరు కంప్యూటర్‌ ఆపరేటర్లు వాపోతున్నారు. సదరు ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే తమకు రెమ్యూనరేషన్‌ రాకుండా అగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెమ్యూనరేషన్‌ మంజూరయ్యేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎస్‌ఎస్‌ఏ పీఓ సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే...
నేను కొత్తగా వచ్చాను. గత ఏడాది చేపట్టిన యూడైస్‌ కార్యక్రమానికి సంబంధించి నాకు తెలీదు. ఆ ఫైలు గురించి విచారించి చర్యలు తీసుకుంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement