- మోకాలొడ్డిన పార్టీ సీనియర్లు
- రెంటికీ చెడ్డ రేవడిగా జ్యోతుల
- ఆయన అనుచరుల్లో అయోమయం
నెహ్రూకు మొండిచేయి
Published Sun, Apr 2 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకోలేదు. జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రివర్గంలో యథాతథంగా కొనసాగనుండడంతో కొత్తవారికి నో ఛా¯Œ్స బోర్డు పెట్టేశారు. శనివారం అర్ధరాత్రి వరకూ మంత్రి వర్గ విస్తరణౖపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పాతవారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎక్కువగా ఉండటం, సామాజిక సమీకరణల నేపథ్యంలో కొత్తగా ఎవరికి ఇచ్చినా తేనెపుట్టను కదిలించినట్టవుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మెట్ట ప్రాంతంలో తలపండిన రాజకీయ నాయకులుగా ముద్ర పడిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు మొండిచేయి చూపించారు.
వైరి వర్గమే కొరివి పెట్టిందా...?
చిరకాల కోరికైన మంత్రి పదవి ఈసారి కూడా నెహ్రూకు దూరమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నెహ్రూ మంత్రి పదవి కోసమే టీడీపీలోకి ఫిరాయించినట్టు చెప్పుకుంటూ వచ్చారు. విస్తరణలో బెర్త్ ఖాయమని అనుచరులు విస్తృతమైన ప్రచారం కూడా చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి ముఖ్య అనుచరులతోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కూడా శనివారం విజయవాడ తరలివెళ్ళారు. తీరా చంద్రబాబు వద్ద సీ¯ŒS రివర్స్ అయింది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచీ నెహ్రూకు రాజకీయంగా వైరి వర్గంగా ఉన్న యనమల రామకృష్ణుడు తెర వెనుక జరిపిన మంత్రాంగం ఫలితంగానే నెహ్రూ ఆశలు ఆవిరయ్యాయని పలువురు భావిస్తున్నారు. నమ్మి టిక్కెట్ ఇచ్చి, ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్ పార్టీని కాదని ప్రలోభాలతో పార్టీ ఫిరాయించినా చివరకు ఫలితం దక్కలేదని నెహ్రూ వర్గం డీలా పడింది. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మార్చి అదే సామాజిక వర్గానికి చెందిన నెహ్రూకు మంత్రి పదవి కట్టబెడతారని విస్త్రృతమైన ప్రచారం జరిగింది. కానీ రాజప్పను కదిపి నెహ్రూకు పట్టం కడితే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని బాబు వెనుకడుగు వేశారు. కాపు సామాజిక వర్గం నుంచి నెహ్రూ, రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గొల్ల పల్లి సూర్యారావు, కమ్మ సామాజిక వర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవులు ఆశించారు. సామాజిక సమతూకంలో భాగంగా ఒకిరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కొత్త సమస్యలు వచ్చిపడతాయని యనమల తదితర నాయకులు సూచించడంతో విస్తరణలో జిల్లా నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పూర్వ స్థితినే కొనసాగించారు. పార్టీని కాదనుకుని రెండు పార్టీలు మారి నిన్నగాక మొన్న తిరిగి వచ్చిన నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే సీనియర్లు ఏమైపోతారని నెహ్రూ వ్యతిరేకవర్గం గట్టి వాదనను వినిపించింది.
ప్యాకేజీ పాత్ర ఎంత...?
పార్టీ ఫిరాయించిన సందర్భంలోనే నెహ్రూకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు నిర్ధిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదన్న వాదన ఉంది. పార్టీ మారడం వెనుక ప్యాకేజీయే కీలకపాత్ర పోషించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నెహ్రూకు స్థానం లభించలేదంటున్నారు. నెహ్రూతో పాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలకు స్థానం దక్కినప్పటికీ నెహ్రూకు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఈ పరిణామాలు పార్టీలో ఎక్కడకు దారితీస్తాయన్నది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement