గ్రామీణ ప్రగతిపై నూతన యాప్
► ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త సత్యనారాయణ
భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల యువశక్తిని వినియోగించుకుని భారతదేశంలో గ్రామీణ ప్రగతిపై ఒక యాప్‌ను తయారు చేసేందుకు జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్‌ఎస్‌సీ) సన్నాహాలు చేస్తున్నట్టు ఎన్ఆర్‌ఎస్‌సీ ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి.సత్యనారాయణ అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యాప్ వివరాలతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. యాప్‌ను జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు అందించేందుకు భవన్ పంచాయతీ మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 574 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో భవన్ పంచాయతీ సేవలు జియో ట్యాగ్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు.
దీనికిగాను సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సత్యనారాయణ చెప్పారు. రెండోదశలో కొన్ని జిల్లాలు, మూడో దశలో అన్ని జిల్లాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 70 జిల్లాల్లో యాప్ తయారుచేయడం పూర్తయిందన్నారు. అనంతరం కళాశాలలోని వెట్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎన్ రాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, స్పేస్ టెక్నాలజీ సెంటర్ కో–ఆరి్డనేటర్ డాక్టర్ వైఎస్‌ఎస్‌ఆర్ మూర్తి, ఆర్‌అండ్‌డీ డీన్ డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.