ముళ్లపొదల్లో పసికూన
-
ఆడపిల్ల అని బయటపడేసిన వైనం
-
గుర్తించిన స్థానికులు
-
పోలీసులకు సమాచారం
-
లింగనిర్ధారణ కోసం ఆస్పత్రికి తరలింపు
జగిత్యాల అర్బన్ : ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ జన్మించిందనే ఆనందంలో సంబరాలుచేసుకుంటారు. జగిత్యాలలో ఓ జంట ఆడపిల్ల పుట్టిందని ఆస్యహించుకుంది. ఆ పసికూనను బయటపడేసింది. మనసును కదిలించిన ఈ సంఘటన వివరాలు ఇవీ.. మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మికి చెందిన నాలుగో వార్డులో కళాశాల వెనుక వైపు ఓముళ్లపొదల్లో శనివారం పసికూన పడిఉంది. అక్కడే చిన్నారులు ఆడుకుంటున్నారు. పందులు ఆ పసికందును నొటకరుచుకువచ్చి చిందరవందర చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు ఇంట్లోని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పందులను వెళ్లగొట్టారు. వెంటనే చైర్‌పర్సన్ విజయలక్ష్మికి సమాచారం అందించారు. ఆమె సీఐ కరుణాకర్‌రావుకు ఫోన్లో సమాచారం అందించారు. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని పసికూన మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆడపిల్లపై సంశయం
విద్యానగర్‌లో ముళ్లపొదల్లో దొరికిన పసికందు ఆడపిల్లనా, మగపిల్లనా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఆడపిల్ల అని చెప్పినప్పటికీ పందులు పూర్తిగా మార్మాలయాలను పీక్కు తినడంతో నిర్ధారణ కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేక నిర్ధారణ కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. స్థానికులు మాత్రం ఆడపిల్లనేనని మొదట్లో చూసినట్లు వారు వివరించారు.