
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి.
అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్‌కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్‌పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు.
‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు.
(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)