మూడో డిపో! | new Liquor third depo in nzb city | Sakshi
Sakshi News home page

మూడో డిపో!

Published Thu, Jun 16 2016 4:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

new Liquor third depo in nzb city

జిల్లాలో కొత్త కల్లు డిపో ఏర్పాటుకు నాయకుల సన్నాహాలు
రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు స్వామిగౌడ్ పేరిట అనుమతి
మూడో కల్లు డిపో వెనుక ‘రాజధాని గౌడ్’
గీత కార్మికులకు న్యాయం జరిగేనా?
ఉత్తర్వులు అందలేదంటున్న ఈఎస్ గంగారాం

సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో మూడో కల్లు డిపో ఏర్పాటుకు అనుమతి లభించింది. ఈనెల 14వ తేదీన ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ మూడో డిపో ఏర్పాటుకు సంబంధించి ఆర్‌సీ 111443 /27 ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిసింది. బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి మూడో డిపో ఏర్పాటు గురించి తెలియజేసినట్లు మూడో డిపో నిర్వాహకులు తెలిపారు.

 అనూహ్యంగా..
కొన్నేళ్లుగా నిజామాబాద్‌లో 1, 2 కల్లుడిపోలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా కొందరు మూడో డిపోకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకటి, రెండు డిపోల కార్మికులకు అన్యాయం జరుగుతుందని మూడో డిపోకు అనుమతి ఇవ్వలేదు. ఒకటి, రెండు డిపోల్లో కొందరు రాజకీయ నాయకులు, అధికార పార్టీకి చెందిన వారు, వ్యాపార వేత్తలు ఉండడంతో.. వారే మూడో డిపో ఏర్పాటు  కాకుండా అడ్డుకున్నారని ప్రచారంలో ఉంది. దీంతో ఏళ్లుగా ఒకటి రెండు డిపోల గుత్తాధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. కార్మికుల పేరుతో కాంట్రాక్టర్లే కోట్లకు పడగలెత్తారు. కార్మికులకు మాత్రం న్యాయం జరుగలేదు.

ఒకటి, రెండు డిపోల మధ్య వివాదం నడుస్తోంది. ఇది రెండేళ్ల క్రితం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా ఒకటి, రెండు డిపోలు కోర్టు స్టేతో కొనసాగుతూ వస్తున్నాయి. పలుసార్లు వివాదాస్పదంలో పడి నిలిచాయి. గతంలో కల్తీకల్లు సేవించి పలువురు చనిపోయిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో మూడో డిపోకు అనుమతి ఇవ్వాలని స్వామిగౌడ్ మరోసారి అధికారులకు విన్నవించుకున్నారు. ఏడాదిగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూవస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కల్తీకల్లు నియంత్రణలో కఠినంగా వ్యవహరించింది. పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు.

అధికారులు సేకరించిన శాంపిళ్లలో కల్తీ తేలడంతో ఒకటి, రెండు డిపోలను మూసివేశారు. ఇదే సందర్భంలో మూడో డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్న స్వామిగౌడ్.. అనుమతి ఇవ్వలంటూ మరోమారు ఎక్సైజ్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో మూడో డిపోకు అనుమతి వచ్చింది. ఈ డిపోకు సంబంధించి మూడు నెలల క్రితం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన ‘చిక్కడిపల్లి గౌడ్ ’, హైదరాబాద్‌లో మంత్రిని కలిసి అనుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు వారితో కుదిరిన ఒప్పందం మేరకు మూడో డిపోను స్వామిగౌడ్ పేరిట మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

 గీత కార్మికులకు న్యాయం జరిగేనా?
సాధారణంగా కల్లుడిపోలు గీత కార్మికులకు ప్రయోజనం కలిగించేలా ఉంటాయి. అలా ఉండడమే కల్లుడిపోల ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం కూడా. అయితే నిజామాబాద్‌లో కొన్నేళ్లుగా అ పదానికి అర్థమే మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముగాసే వ్యాపారవేత్తలు, రైసుమిల్లు వ్యాపారులు, కొందరు ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లోకి కల్లుడిపోలు వెళ్లాయి. గీత కార్మికుల ప్రయోజనాలను గంగలో కలిపి.. కల్లీ కల్లు వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు.

అయితే ఇటీవల ప్రభుత్వం కల్లీకల్లుపై ఉక్కుపాదం మోపడం, నిజామాబాద్‌లోని రెండు డిపోల మధ్యన నెలకొన్న వివాదం తదితర కారణాలతో రెండు డిపోలు మూతపడగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి, చిక్కడపల్లి గౌడ్ సహకారం, భాగస్వామ్యంతో మూడో డిపోకు అనుమతి లభించింది. అయితే ఒకటి, రెండు డిపోలు మూతపడిన నేపథ్యంలో మూడో డిపోకు అనుమతి లభించగా... ఈ డిపోతోనైనా అసలైన గీత కార్మికులకు న్యాయం జరుగుతుందా? అన్న చర్చ జరుగుతోంది.  గతంలో రెండు డిపోల్లో కలిపితే రోజుకు రూ. 14 లక్షల వరకు కల్లు విక్రయాలు జరిగేవి.

కొద్ది రోజులుగా ఆ రెండు డిపోలు మూతపడగా.. కొత్తగా ప్రారంభించే మూడో డిపోకు భారీగానే కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు. మూడో డిపోకు అనుమతి పొందిన నిర్వాహకులు మాత్రం కార్మికులకు న్యాయం చేస్తామని, నగరంలోని గీత కార్మికులను కలుపుకొని డిపో నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. సుమారు 2 వేల మంది గీత కార్మికులకు తోడు, ఒకటి, రెండు డిపోల రద్దుతో ఇబ్బందుల్లో పడ్డ గీత కార్మికులకు చేయూతనిస్తామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఒకటి, రెండు డిపోలు 2 వేల మంది గీత కార్మికులు స్థానికంగా ఉన్నవారుకాగా.. మూడో డిపోకు సంబంధించిన గీత కార్మికులు సగం మంది బయటవారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement