
ఆదాయానికి అడ్డదారి
⇒ఎక్సయిజ్ ఆదాయానికి కొత్త ఎత్తుగడ
⇒సుప్రీంకోర్టు తీర్పుకు నిలువునా తూట్లు
⇒ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లు లోకల్ రోడ్లేనట
⇒మద్యం దుకాణాల మార్పుపై కొత్త రూటు
⇒జిల్లాలో 300లకు పైగా దుకాణాలు అక్కడే
మద్యం దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ‘ నా దారి అడ్డదారే..’ అనే ధోరణిలో ముందుకు వెళుతోంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), రాష్ట్ర రహదారుల(ఎస్‌హెచ్)పై ఉన్న మద్యం దుకాణాలే కారణమని.. వీటిని అక్కడి నుంచి తీసేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తోంది. ఆదాయార్జనకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది.
చిత్తూరు (అర్బన్): మద్యం విషయంలో ఆదాయార్జనే ముఖ్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. జిల్లాలో 430 మద్యం దుకాణాలు, 26 బార్లు ఉన్నాయి. దుకాణా లకు రెండేళ్ల పాటు లైసెన్సులివ్వడం ద్వారా రుసుము, పర్మిట్ల రుసుం రూపంలో రూ.172 కోట్ల ఆదాయం లభిస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నా యి. ఇంత భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతుండటంతో ఆదాయ వనరులను కాపాడుకోవడానికి సుప్రీం కోర్టు తీర్పును అపహాస్యం చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదనే వైఖరిలో ఉంది.
కోర్టు తీర్పుకు కొత్త భాష్యం..
ఎన్‌హెచ్‌పై 500 మీటర్లు, ఎస్‌హెచ్‌లపై 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చింది. వాహనాలను ఆయా ప్రాంతాల్లో ఆపి మద్యం సేవించడం వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణమని కూడా వ్యాఖ్యానించింది. జూలై 1 నుంచి ఈ తీర్పు అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి ఈ తీర్పు మింగుడుపడలేదు. దీంతో కొత్త ప్రతిపాదనలకు తెరతీసింది. ఇప్పటికే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను అక్కడి నుంచి కదలించకుండా ఎండీఆర్ (జిల్లా మేజర్ రోడ్లు)గా మార్పు చేయాలని భావించింది. 250 కిలో మీటర్ల రోడ్లను ఎండీఆర్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. వీటిని కేంద్ర రహదారులు, రవాణ మంత్రిత్వశాఖకు పంపించడానికి రంగం సిద్ధం చేసుకుంది. కేంద్ర ఆమోదం తర్వాత∙జిల్లాలోని 250 కి.మీ దూరం ఉన్న రోడ్లు ఎండీఆర్‌గా మారిపోనున్నాయి. ఫలితంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడే ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లపై వ్యాపారాలు పెట్టుకోవచ్చు. వీటికి తోడు జిల్లాలో 9 ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ఉన్న బార్లు కూడా యధాస్థితిలో కొనసాగుతాయి.
కలిసొస్తున్న బైపాస్ రోడ్లు..
నగరాలు, పట్టణాల్లో వాహనాలు ఎన్‌హెచ్‌లపై వెళ్లకుండా బైపాస్ రోడ్ల మీదుగా వెళ్లడానికి ట్రాఫిక్‌ను మళ్లించారు. జిల్లాలోని చెన్నై–బెంగళూరు, కాణిపాకం–బెంగళూరు, తిరుపతి–పుత్తూరు, తిరుపతి నాయుడుపేట లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బైపాస్ రోడ్లను ఎన్‌హెచ్‌లుగా గుర్తించి.. మద్యం దుకాణాలున్న జాతీయ రహదారులను స్థానిక రోడ్లుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడానికి నివేదిక సిద్ధం చేసింది.