ఆ చట్టం అమలైతే డ్రైవర్లకు ఉరితాడే!
కర్నూలు (రాజ్‌విహార్): సవరించిన మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే డ్రైవర్లకు ఉరితాడే మిగులుతుందని ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జె. దివాకర్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లాలో ఎస్‌డబ్ల్యూఎస్, మోటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కార్మికులు, ప్రజా సంఘాలు ఆక్టు సవరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమోదం కోసం కేంద్ర కసరత్తు చేస్తోందని చెప్పారు. ఆర్టీసీకి ఉన్న రక్షణను తొలగించి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రమాదాలు తగ్గించాలనే పేరుతో డ్రైవర్లపై జరిమానాలు, శిక్షలు పెంచారని సీఐటీయూ నగర నగర కార్యదర్శి ఎండి అంజిబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాయుడు, మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.