భర్త కబురు లేక కలవరం
కొలిక్కిరాని కిడ్నాప్ ఉదంతం
రెండు రోజులపాటు నైజీరియా గవర్నమెంట్‌కు సెలవులు
విశాఖపట్నం : రోజులు గడుస్తున్నా నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీరు సాయిశ్రీనివాస్ జాడ కానరావడం లేదు. ఎనిమిది రోజులు గడిచినా కబురు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. ఇంట్లోని సెల్ మోగగానే చల్లని కబురు వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. తీరా శ్రీనివాస్ ఆచూకీ కోసం బంధువులు ఫోన్ చేశారని తెలిసి నీరశించిపోతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా అమ్మతోనే ఉంటూ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రీనివాస్ భార్య లలిత అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా కిడ్నాప్‌పై నైజీరియాలోని భారత హైకమిషన్ చేపడుతున్న చర్యలు తెలుసుకుంటున్నారు. నేడు, రేపు అంటూ కాలయాపన జరుగుతుందే తప్ప పురోగతి ఉండడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు.
మరో రెండు రోజుల తర్వాతే...
రంజాన్ సందర్భంగా నైజీరియా గవర్నమెంట్‌కు రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయని అక్కడి భారత హైకమిషన్ నుంచి సమాచారం వచ్చిందని శ్రీనివాస్ భార్య లలిత తెలిపారు. దీంతో మరో రెండు రోజుల తర్వాతే కిడ్నాప్ ఉదంతం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భారత హైకమిషన్ మాత్రం ఆందోళన చెంద వద్దని, సెలవుల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి సురక్షింతంగా శ్రీనివాస్‌ను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారని, దీంతో ఆశగా ఎదురు చూస్తున్నామని లలిత చెబుతున్నారు.