నిధులు నీళ్లపాలు !
నిధులు నీళ్లపాలు !
Published Fri, Aug 12 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
మంగపేట :మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ఏర్పడిన ఒర్రెను పూడ్చేందుకు వెచ్చించిన లక్షల రూపాయల ప్రజాధనం గోదావరి పాలయింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పుష్కరఘాట్‌కు ఎగువ ప్రాంతమైన పొదుమూరు, పంట పొలాల మీదుగా వరదనీరు ప్రవహించడంతో ఘాట్‌ను ఆనుకుని సుమారు 40 నుంచి 50 మీటర్ల వెడల్పుతో భారీ ఒర్రె ఏర్పడింది. రూ.4.22 కోట్ల పుష్కర నిధులతో నిర్మించిన ఘాట్ దెబ్బతినడంతో ‘ఘాట్‌కు పొంచి ఉన్న ముప్పు’ అనే కథనాన్ని ‘సాక్షి’ జూలై 22న వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని ఐటీడీఏ పీఓ, మైనర్ ఇరిగేషన్ అధికారులు సందర్శించి యుద్ధప్రాతిపదికన ఒర్రెను పూడ్చే చర్యలు చేపట్టారు.
ఒర్రెలో ఒండ్రు మట్టితో కూడిన ఇసుక బస్తాలను ఒడ్డు వెంట వేశారు. గోదావరి పొంగి ప్రవహిస్తే ఒడ్డుతో పాటు ఇసుక బస్తాలు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో గమనించిన ‘సాక్షి’ ముందుగానే ‘వరద ఉధృతికి ఇసుక బస్తాలు నిలిచేనా’ అనే కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఆ తాకిడికి అన్నీ కొట్టుకుపోయాయి. ఒడ్డు వెంట రాళ్లతో కానీ, సిమెంట్ కాంక్రిట్‌తో కానీ వాల్ నిర్మించాల్సి ఉండగా, పలువురు మైనర్ ఇరిగేషన్ అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగిన ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై టెండర్ నిర్వహించకుండా డిపార్ట్‌మెంట్ పేరుతో నాసిరకంగా పనులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే నిధులు నీళ్లపాలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పీఓ స్పందించి నాసిరకంగా పనులు చేసిన వారి బిల్లులు నిలిపివేయాలని, ఒడ్డువెంట కరకట్ట నిర్మించేలా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మైనర్ ఇరిగేషన్ డీఈఈ యశ్వంత్‌ను వివరణ కోరగా పనులు ఇంకా పూర్తి కాలేదని, ఒక్క రూపాయి బిల్లుకూడా చెల్లించలేదని అన్నారు. పని చేసినంతమేరకే బిల్లు చెల్లిస్తామని చెప్పారు.
Advertisement