
రాష్ట్రంలో మనమే ఫస్ట్!
♦ హరితహారంలో జిల్లాకు మొదటి స్థానం
♦ 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన జిల్లా
♦ సీఎం కార్యాలయం నుంచి ప్రశంసలు
♦ అధికారుల కృషి వల్లేనన్న కలెక్టర్ యోగితా రాణా
♦ బాధ్యతా రహితంగా ప్రవర్తించే ఏపీవోలపై చర్యలకు ఆదేశం
ఇందూరు : అన్ని కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్న నిజామాబాద్ జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు 3 కోట్ల 35లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను, ఇప్పటి వరకు 2 కోట్ల 10 లక్షల 28 వేల మొక్కలను నాటి, 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన మొదటి జిల్లాగా నమోదైంది. గురువారం ఒక్క రోజే 19.56 లక్షల మొక్కలు నాటారు. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి ప్రశంసలు అందాయి. కలెక్టర్ యోగితా రాణా, ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ఖితాబునిచ్చారు. అయితే కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం జిల్లాలోని 36 మండలాల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, చేంజ్ ఏజెంట్లు, ఏపీవోలతో హరితహారం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడారు. జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని చేరేందుకు అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతి నిధుల శ్రమ వల్ల సీఎం కార్యాలయం నుంచి అభినందిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు అధికారులు ఇదే ఉత్సాహంతో పని చేయాలని, బాధ్యతారహితంగా ప్రవర్తించే అధికారులపై, ఏపీవోలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో వివిధ మొక్కలను నాటాలని, ఇళ్ల వద్ద వారికి కావాల్సిన మొక్కలను అందజేయాలని తెలిపినా, ఇంత వరకు లక్ష్యాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. జిల్లాలో గల 718 గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల వారీగా 4వేల ప్రకారం అందించే టేకు స్టంపులను నాటించాలన్నారు. టార్గెట్ పూర్తికాని గ్రామ పంచాయతీలకు స్టంపులను ఇచ్చి వారి టార్గెట్‌ను పూర్తి చేయించాలని సంబంధిత మండలాధికారులకు సూచించారు. 30 వేల లక్ష్యం దాటిన గ్రామ పంచాయతీలకు 2 వేల 500 పండ్ల మొక్కలను అందజేయాలని తెలిపారు.
జిల్లాలో ఆర్మూర్, పిట్లం, బీర్కూర్, నిజామాబాద్ మండలాలు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని చేరుతున్నందుకు అధికారులను అభినందించారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లో రెండు రోజుల్లో పనులను పూర్తి చేయించాలని తెలిపారు. జిల్లాలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 40 వేల లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి మండలంగా నమోదు అయినందుకు ఆ టీం సభ్యులను అభినందించారు. కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ రాజారాం, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్‌డీఏ చంద్రమోహన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, సోషల్ ఫారెస్టు అధికారిణి సుజాత తదితరులు పాల్గొన్నారు.