‘నీరు’గార్చేస్తున్నారు! | No action on violations | Sakshi
Sakshi News home page

‘నీరు’గార్చేస్తున్నారు!

Published Thu, Sep 29 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రామభద్రపురం మండలం కోట శిర్లాం గ్రామంలోని  జంటిగెడ్డ వద్ద నిర్మించిన చెక్‌డామ్‌

రామభద్రపురం మండలం కోట శిర్లాం గ్రామంలోని జంటిగెడ్డ వద్ద నిర్మించిన చెక్‌డామ్‌

నీరు–చెట్టు అక్రమాల గుట్టు బట్టబయలైనా కానరాని చర్యలు
సోషల్‌ ఆడిట్‌ పబ్లిక్‌ హియరింగ్‌కు మోకాలడ్డు 
ఇరిగేషన్‌ జేఈ, డీఈఈ సస్పెండ్‌ చేయాలన్న కలెక్టర్‌ ఉత్తర్వులు భేఖాతర్‌
ఫోర్జరీ సంతకాలపై కొరవడిన విచారణ
రాజకీయ అండతో తప్పించుకుంటున్న అక్రమార్కులు 
 ఇరిగేషన్‌ అధికారులు చేపడుతున్న విచారణపై కలగని నమ్మకం
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అక్రమాలు జరుగుతున్నా... పట్టించుకోరు. ఆరోపణలు వినిపిస్తున్నా... చర్య తీసుకోరు. నిబంధనలు అతిక్రమిస్తున్నా... కిమ్మనరు. ఇదంతా అస్మదీయుల వరకే. పరాయివారైతే వెంటనే చర్యలకు ఉపక్రమించే పాలకులు తమవారు తప్పు చేస్తే వెనకేసుకు వస్తారు. వాటిని నీరుగార్చేవరకూ నిద్రపోరు. తమవారి అక్రమాలకు సహకరించేవారినీ పరిరక్షిస్తుంటారు. ఇందుకు ఉదాహరణే జిల్లాలో జరిగిన నీరు–మీరు చెట్టులో జరిగిన అక్రమాలపై చర్యల్లో జాప్యం. ఒకసారి స్టేట్‌ రీసోర్స్‌టీమ్‌ పర్యటించి... అక్రమాల నిగ్గు తేల్చింది. వాటిపై పబ్లిక్‌ హియరింగ్‌ను మాత్రం వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. కాలయాపన చేసి నీరుగార్చే యత్నం చేస్తున్నారు. మరోసారి ఇరిగేషన్‌ అధికారులు జరుపుతున్న పరిశీలనలు తమను తప్పుదారి పట్టించేందుకేనని ప్రజలు నిర్ధారణకు వచ్చేశారు. రామభద్రపురం మండలం కోట శిర్లాం గ్రామంలోని జంటిగెడ్డ వద్ద నిర్మించిన చెక్‌డామ్‌. నాసిరకంగా నిర్మించడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీని కోసం రూ. 11లక్షల 65వేల మేరకు బిల్లులు చెల్లించేశారు. ఇక్కడ జరిగిన అవినీతి భాగోతాన్ని ఇరిగేషన్‌ అధికారులు గురువారం కళ్లారా చూశారు. నాసిరకం నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఇదే కాదు ఏడొంపుల గెడ్డపై రూ. 11లక్షల 35వేల 200తో నిర్మించిన చెక్‌ డ్యామ్‌ కొట్టుకుపోయింది. దీన్నీ పరిశీలించారు. సిమాలు మట్టిగెడ్డపై చెక్‌డామ్‌ నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి రూ. 11లక్షల 83వేల 145 కాజేసిన ప్రాంతాన్నీ చూశారు.దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా అక్రమాలు జరిగిన ఇన్నాళ్లకు ఇరిగేషన్‌ అధికారులు విచారణ చేపడుతున్నారు. బిల్లులు పూర్తిగా డ్రా చేశాక ఫిర్యాదులు వెల్లువెత్తడంవల్లే అదైనా చేస్తున్నారు. ముందే విచారణ చేపట్టినట్టయితే అక్రమార్కుల అవినీతి భాగోతమంతా బయటపడేది. ఏదైతేనేమి ఇప్పటికైనా విచారణకు వచ్చారు. బుధ, గురువారాల్లో ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎం.వి.రమణమూర్తి, ఈఈ జి.వి.రమణ, పలువురు జేఈలు విచారణపేరుతో పరిశీలన చేశారు. కాకపోతే, గత అనుభవాల దష్ట్యా చర్యలపై అనుమానాలు నెలకున్నాయి. 
 
 
అక్రమార్కులకు పాలకుల అండ
నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల్లో రామభద్రపురం మండలంలోనే రూ. 3కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సోషల్‌ ఆడిట్‌లో ఈ విషయం రుజువైంది కూడా. స్లూయిజ్, మదుములు, తూముల నిర్మాణాల పేరిట దోపిడీకి పాల్పడ్డారనీ, అసలు పనులు చేపట్టకుండా బిల్లుల చేసుకున్నారనీ... పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున పనులు చేసినట్టు బిల్లులు డ్రా చేసుకున్నారనీ.. కొన్నిచోట్ల నాసిరకం పనులు చేపట్టి నిధులు మింగేశారనీ దాదాపు నిర్థారణకు వచ్చారు. అయితే దాదాపు అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడటంతో సోషల్‌ ఆడిట్‌పై పబ్లిక్‌ హియరింగ్‌ జరగకుండా, తక్షణ చర్యలు లేకుండా నేతలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. 
 
 
కలెక్టర్‌ ఆదేశాలు భేఖాతర్‌ 
అవినీతి అక్రమాలకు సంబంధం ఉన్న ఇరిగేషన్‌ జేఈ, డీఈలను సస్పెండ్‌ చేయాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రామభద్రపురం ఎంపీడీఓ, ఏపీఓ సస్పెండ్‌ చేసిన రోజునే ఈ ఉత్తర్వులు ఇచ్చారు  దాదాపు నెల రోజులు కావస్తోంది. కానీ ఇంతవరకు ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. కారణం టీడీపీ నేతలకు ఆ ఇంజినీర్లు సంపూర్ణ సహకారం అందించినందుకే. పనులు ఎలా చేసినా బిల్లులు ఇచ్చేశారు. ఎంబుక్‌ల్లో  ఏకంగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇష్టారీతిన కొలతలు నమోదు చేసేశారు. నచ్చినంతకు బిల్లు తయారు చేసి పాస్‌ ఆర్డర్‌ జారీ చేసుకున్నారు. మరికొన్నిచోట్ల కొలతల పుస్తకాలు(ఎంబుక్‌) తారుమారు చేసి నిధులు డ్రా చేసేశారన్న వాదనలూ ఉన్నాయి. దీనిపై రామభద్రపురం పోలీసు స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.వి.రమణ ఏకంగా కేసు పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసేశారని ఆయన ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా విచారణ చేపట్టలేదు. ఎవరా ఘనులన్నది నేటికీ తేల్చలేదు. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే వాదనలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement