స్కూల్ ఫీజులపై ఏమైనా చెప్పాలనుకుంటున్నారా...
హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు విచ్చిలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులపై మరో పోరుకు స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటైన జేఏసీ కార్యాచరణ రచించింది. ఇప్పటికే పలు రూపాల్లో అధిక ఫీజుల వసూళ్ల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మాజీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. బుల్గయ్య తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ జేఏసీ చైర్ పర్సన్ అరవింద జటా, సెక్రటరీ జనరల్ నాగటి నారాయణ పేర్కొన్నారు.
ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఫీజు వసూలును నియంత్రిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని వారు పేర్కొన్నారు. చివరకు అసెంబ్లీలో సైతం మాటిచ్చినా ఇంతవరకు కదలిక లేదన్నారు. దీంతో స్కూళ్లు ఫీజులను మరింత పెంచాయని, తల్లిదండ్రులపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ విచారణ చేపట్టామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వాణి వినిపించాలని పిలుపునిచ్చారు.