ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.
మరీ ముఖ్యంగా ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్ ఫోన్ లో ఓ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్‌లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు.
సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్ ఇంజక్షన్ ద్వారా కూడా సివిల్ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఎఫ్.ఐ.ఆర్. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్
Comments
Please login to add a commentAdd a comment