అడ్రస్లేని అన్న క్యాంటీన్లు
తిరుపతికి ఐదు క్యాంటీన్లుగా ప్రకటన
స్థల పరిశీలనచేసి ఏడాదిన్నర
ఇప్పటికీ ఏర్పాటుకు నోచుకోని వైనం
పేదలు, చిరుద్యోగుల కడుపు నింపే విధంగా ఏర్పాటు చేయాలనుకున్న అన్నా క్యాంటీన్ల పథకం అడ్రస్‌లేకుండా పోయింది. తిరుపతిలో ఐదు క్యాంటీన్ల ఏర్పాటుకు స్థల పరిశీలనచేసి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు పాలకులు, అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తిరుపతి : ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదేనేమో. 2014 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్ష హోదాలో చంద్రబాబునాయుడు వందలాది హామీలను ప్రజలముందు గుప్పించారు. తీరా సీఎంగా గద్దెనెక్కాక ఆ హామీల మాఫీపైనే దృష్టి సారించారు. తమిళనాడు తరహాలో నగర పేదలను దృష్టిలో ఉంచుకుని రూ.5కే టిఫిన్, 7.50 పైసలకే మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొస్తామని ఊదరగొట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2014 సెప్టెంబర్‌కల్లా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తమ మంత్రుల బృందం తమిళనాడు కెళ్లి అమ్మ క్యాంటీన్లను పర్యవేక్షించి అదే తరహాలో నగరాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయన్నుట్టు తెలిపారు. ఈ మాట చెప్పి ఇప్పటికి 14 నెలలు గడుస్తున్నా వీటి ఊసెత్తడంలేదు. ఏడాది క్రితం మంత్రి నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో అన్నా క్యాంటీన్లు నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించారు. గత నెల అక్టోబర్‌లో జిల్లా కమిటీ వచ్చి తిరుపతికి ఐదు క్యాంటీన్లు వచ్చాయని చెప్పారు. ఇలా తిరుపతికి వచ్చినవారంతా ఇదే ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఏర్పాటుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడంలేదు.
మూడు కాదు ఐదు
గత ఏడాది సెప్టెంబర్‌లో తుడా కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తుడా వీసీ, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో తిరుపతి అభివృద్ధిపై చర్చించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రధానంగా చర్చసాగింది. తిరుపతి నగరానికి మూడు అన్నా క్యాంటీన్లు మంజూరయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. తిరుపతిలో మూడు క్యాంటీన్లు చాలవని, వీటి సంఖ్య ఐదుకు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు.
స్థానిక పేదలతో పాటు తిరుమలకు వచ్చే యాత్రికులకూ వీటిని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఐదు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలను ఎంపిక చేశారు. టీటీడీ సహా యం తీసుకుని వీలైతే మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని చర్చించారు. అయితే ఇవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.
ఇక్కడే క్యాంటీన్ల ఏర్పాటు
అన్నాక్యాంటీన్ల దుస్థితి ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం దారిలోనే పయనిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఐదు ప్రాంతాలను ఎంపిక చేశారు. శ్రీనివాసం, విష్ణు నివాసం సముదాయాలు, బస్టాండ్, రుయా ఆస్పత్రి, నాలుగు కాళ్లమండపం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇవి నిర్వహణకు మాత్రం నోచుకోలేదు.
మెనూ ప్రకటన
అన్నా క్యాంటీన్ల ద్వారా నగరంలోని పేదలకు భోజన భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న అమ్మ క్యాంటీన్ల తరహాలో ఎన్‌టీఆర్‌కు మారు పేరైన ‘అన్నా’ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రూ. 5కే ఇడ్లీ, పొంగల్, ఉప్మా అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా రూ.7.50 పైలకే మధ్యాహ్న భోజనంలో పులిహోరా, సాంబారురైస్, పెరుగన్నం పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇవేవీ ఇంతవరకు అమలు కాలేదు.