నో క్యాష్
నో క్యాష్
Published Thu, Nov 17 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : బ్యాంకుల్లో నగదు నిండుకోవడంతో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ రూ.500 నోట్లు బ్యాంకులకు చేరుకోకపోవడంతో చిల్లర ఇబ్బందులు తీరడం లేదు. పాత నోట్లు అయిపోవడం, కొత్త నోట్లు లేకపోవడంతో బ్యాంకుల ముందు క్యూలు తగ్గడం లేదు. బుధవారం జిల్లాలోని చాలా బ్యాంకుల్లో మధ్యాహ్నం 12 గంటలకే లావాదేవీలు నిలిపివేశారు. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు అందక 6 వేల మంది జూట్ మిల్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ యూనియ¯ŒS నాయకులు ఏలూరులో రోడ్డెక్కారు. జూట్‌మిల్ ఎదుట రాస్తారోకో చేశారు. మరోవైపు ఏలూరులోని నిమ్మ మార్కెట్ మూతపడింది. దీంతో చాలా మందికి పని లేకుండా పోయింది. ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500 నగదు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ మెషిన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఆ మేరకు మార్పు చేయకపోవడంతో రూ.2 వేలు మాత్రమే వస్తున్నాయి. రూ.వంద నోట్లు ఏటీఎంలలో పెట్టిన క్షణాల్లోనే నిండుకుంటున్నాయి. దీంతో చిల్లర నోట్ల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మార్కెట్లోకి రూ.2 వేల నోట్లు విడుదల కావడంతో చిల్లర కోసం పాట్లు తప్పడం లేదు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని బ్యాంకు అధికారులు సమాధానం చెబుతున్నారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు నిబంధనలు అనుసరిస్తూనే బ్యాంకర్లు కొత్త షరతులకు తెరలేపడంతో జనం చిన్న నోట్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల మార్పిడిలో భాగంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక బ్యాంకులో ఒకసారే నోట్లు మార్చుకోవాలన్న నిబంధనలతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తున్నారు. అసలే వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రూ.వంద నోట్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలను ఎన్నిసార్లు వినియోగించుకున్నా.. ఆ లావాదేవీలకు సంబంధించి చార్జీలు వసూలు చేయబోమని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే బ్యాంకులకు చిన్న నోట్లు రాకపోవడంతో ఏటీఎంలలో పెట్టడం లేదని, చార్జీలు రద్దు చేసినా ఫలితం లేకుండాపోయిందని పలువురు వాపోతున్నారు.
Advertisement