ప్రైవేటుకు నోఛాన్స్
పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లకుండా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాలని భావిస్తున్న విద్యార్థులకు ఇక భంగపాటే. పాఠశాలలో చదవకుండా పరీక్షలు సమీపించే ముందు కాండొనేషన్ ఫీజు చెల్లించి ప్రైవేటుగా హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో ఆ అవకాశం చేజారింది.
* రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్తేనే టెన్త్ పరీక్షకు అర్హులు
* మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
* ప్రైవేటు విద్యార్థులకు ఇక దూర విద్యే దిక్కు
గుంటూరు ఎడ్యుకేషన్: నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం అమలు కారణంగా టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో రెగ్యులర్‌గా హాజరవుతున్న విద్యార్థులే అర్హులుగా పేర్కొంటూ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాధారణంగా ప్రతి యేటా ప్రైవేటు విద్యార్థుల మాదిరిగా హాజరు మినహాయింపు కోరుతూ పరీక్ష ఫీజుతో పాటు కాండొనేషన్ ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేస్తుంటారు. ఈ విధంగా దరఖాస్తు చేసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థులుగా పరిగణించి పరీక్షలకు అనుమతిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన సీసీఈ ప్రభావంతో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులు మినహా ప్రైవేటుగా విద్యార్థులెవ్వరూ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. సీసీఈ విధానంతో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ, మరో 20 మార్కులను విద్యార్థుల ఓవరాల్ ప్రతిభ ఆధారంగా లెక్కిస్తారు. దీంఓ పాఠశాలకు వెళ్లని విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయింది.
తగ్గిన గుర్తింపులేని స్కూళ్ల సంఖ్య..
జిల్లాలో గత మూడేళ్ల క్రితం వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు 10 వేల వరకూ ఉంటుండగా, గుర్తింపు లేని స్కూళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో 2015–16 విద్యాసంవత్సరంలో వీరి సంఖ్య 3,450కి పరిమితమైంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఉత్తర్వులతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మినహా ప్రైవేటు అనే మాట లేకుండా చేసినట్లయింది. దీంతో పరీక్షలకు ప్రైవేటుగా హాజరు కావాలని భావిస్తున్న విద్యార్థులు దూర విద్యను ఆశ్రయించాల్సి వస్తుంది. అటువంటి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే దూర విద్య టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సి ఉంది.
చైల్డ్ ఇన్ఫో డేటా ఆధారం..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డు ఆధారంగా వారికి సంబం«ధించి అన్ని వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదుచేసిన విద్యాశాఖ, దాని ఆధారంగానే విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అనుమతించనుంది. ఆధార్ కార్డు వివరాలు నమోదు అయిన విద్యార్థులనే పదో తరగతి పరీక్షలకు అర్హులుగా గుర్తించనున్నారు.